హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పోటీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యేనని తొలుత అనుకున్నా.. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడంతో ముక్కోణపు పోటీగా  మారింది. అయితే ఫలితంతో సంబంధం లేకుండా గట్టిగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హుజురాబాద్‌లో  కాంగ్రెస్ మంచి ఓటింగ్ సంపాదించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన కౌశిక్‌ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే  కౌశిక్‌ రెడ్డిని గెలిపించడానికి.. టీఆర్ఎస్ సహకరించిందని, డబ్బులు కూడా పెద్దఎత్తున పంపిణీ చేసిందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఈటల రాజేందర్ ఆరోపించారు. అయితే 2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఉపపోరులో ఎన్ని ఓట్లు రాబట్టుకుంటుంది  అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు.. కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిని కాదని స్థానికేతరుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తన స్థానికత ప్రస్తావన తెచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పోటీ చేస్తున్నానని, స్థానికత విషయం పెద్దగా లెక్కలోకి రాదని ఆయన అన్నారు. ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగ అస్త్రాన్నే ఎక్కుపెట్టేందుకు ప్లాన్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ట్యాగ్ లైన్‌ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా  విస్మరించిందని, ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ చెబుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 36 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్లే తనకు మద్దతుగా ఉంటారన్న ధీమాను ఆయన కనబరుస్తున్నారు. ఫీజు రీఅంబర్స్‌మెంట్ అందని వాళ్ల కోసం కూడా గళం విప్పుతానని అంటున్నారు. మొత్తం యువతను ఆకట్టుకునే ప్రయత్నాల్లో బల్మూరి వెంకట్‌ ఉన్నారని తెలుస్తోంది.

అయితే హుజురాబాద్‌ ఉపఎన్నికలో యువత ఓట్లను భారతీయ జనతా పార్టీ కొంత, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొంత లాగేసుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ తన ప్రధాన ప్రచార అస్త్రంగా నిరుద్యోగ సమస్యను ప్రస్తావించినప్పటికీ.. అదే డిమాండుతో  కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మరి వాళ్లందరికీ ఎన్నో కొన్ని ఓట్లు వెళితే.. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా హుజురాబాద్‌ ఉపఎన్నికల ఫలితం వచ్చాకే.. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పదిలంగా ఉందో లేదో అనేది తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: