తెలంగాణ రాష్ట్రంలో భూములు అన్యాక్రాంతం అవడం పెరిగిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఈ సంఖ్య వేల ల్లోనే ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వాటికి సంబందించిన పత్రాలు కూడా ఆయా కార్యాలయాల నుండీ మాయమైపోతున్నాయి. ఇలా దాదాపుగా రెండువేల ఆస్తులకు చెందిన పత్రాలు మాయమైనట్టు గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 33929 దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానా, చిల్లా, టాకియా, శ్మశానవాటికలు, ఇతర సంస్థల పరిధిలో 77538 ఎకరాల భూమి ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందులో 57423 ఎకరాలు అన్యాక్రాంతంలో ఉన్నాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

అయితే వీటిలో కొన్నిటికి న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో స్వాధీనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండు చోట్ల 1132 ఎకరాలు కూడా ఇలా ఏదో ఒక వివాదంలో ఉన్నాయి. క్రితం సారి అక్రమార్కులకు 2186 మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీరిలో కొందరు నోటీసులు పట్టించుకోకపోవడం, మరి కొందరు న్యాయవివాదాలు లేవనెత్తడంతో పటిష్ట చర్యలు తీసుకోలేకపోయారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత కూడా ఈ కేసుల పరిష్కారానికి కుదరలేదు. అందుకే క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించడానికి ప్రయత్నించింది ప్రభుత్వం అయినప్పటికీ ఫలితం లేదు. కారణం అందులో చాలా భూములకు సరైన పత్రాలు లేవు, ఉన్నవి శిధిలావస్థలో ఉన్నవి, మరికొన్ని ఆయా పరిస్థితులకు అనుగుణంగా లెక్కల నుండే తొలగించడం జరిగింది.

దీనితో కబ్జా దారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. అందువలన వక్ఫ్ భూములు వేల ఎకరాలు న్యాయవివాదాలలోనే నలిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన 1132ఎకరాలు న్యాయవివాదాలలోనే ఉన్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో 989 ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చింది వక్ఫ్ బోర్డు. వాటిని సర్వే చేసి ఖాళీ చేయించేందుకు రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో ఒక టాక్స్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు మరో నాలుగు నెలలు పట్టవచ్చు అంటున్నారు అధికారులు. ఇక హైదరాబాద్ పట్టణంలో ఖైరతాబాద్, సైదాబాద్, నాంపల్లి, బహదూర్ పుర, గుట్టల బేగం పేట, నెక్నాంపూర్, మేడ్చల్, మౌలాలి, మల్కాజ్ గిరి, ఘట్కేసర్, ఆసిఫ్ నగర్ లలో వక్ఫ్ బోర్డు కు సంబంధించి విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిపై కూడా కొందరి కన్ను ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైనా పిర్యాదు చేస్తేనే వీటిపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇలా కనీసం శ్మశానాలను కూడా వదల కుండా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: