హుజూరాబాద్ ఉప ఎన్నకకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ టగ్ ఆఫ్ వార్ జరుగుతుందని భావిస్తున్న సమయంలో కాంగ్రెస్  కూడా పరువు నిలుపుకునే పోరాటం సాగిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ పరిధిలో నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ పరిణామం ఎవరికి లాభిస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లో మొదలైంది.


అంతే కాదు.. ఇప్పుడు దళిత బంధు పథకానికి బ్రేక్ రావడాన్ని కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. దళిత బంధు ఆగిపోతుందని కేసీఆర్‌కు ముందే తెలుసంటూ విమర్శలు ప్రారంభించారు బీజేపీ నాయకులు. దళితులను మరోసారి మోసం చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దళిత బంధు స్కీం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే కారణం అంటున్నారు బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్. ఎన్నికల కమిషన్ ఈ స్కీంను ఆపేసేందుకు అవకాశం కల్పించేలా కేసీఆర్ వ్యవహరించారన్నది బండి సంజయ్ విమర్శ.


దళిత బంధు పథకం నిలిపేస్తారని కేసీఆర్‌కు ముందుగా తెలుసని బండి సంజయ్ విమర్శిస్తున్నారు. ఈసీ ఈ స్కీంను నిలిపేస్తుందని కేసీఆర్‌కు ముందే తెలుసు కాబట్టే.. నిన్న మీటింగ్ నిర్వహించి దళిత బంధుపై చిలుక పలుకులు పలికారని విమర్శించారు. నిబంధనల ప్రకారం కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్ ఎప్పుడూ నిలిపి వేయదన్న బండి సంజయ్.. కానీ కేసీఆరే ఆ స్కీం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండా చేశారని మండిపడ్డారు.


ఇప్పుడు దళిత బంధుపై కొత్త రాజకీయం ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. విపక్షాల వల్లే ఈ పథకం ఆగిపోయిందని ఇప్పుడు టీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం ప్రారంభిస్తాయి. ఇక వీరిపై వారు.. వారిపై వీరు విమర్శల డోసు పెంచేసుకుంటారు. మరి ఎవరి వాదనను హుజూరాబాద్ ప్రజలు నమ్ముతారో.. ఎవరికి ఓటేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: