అసలు నిధుల కొరత... జీతాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రతి నెలా అప్పు కోసం ఎదురుచూపులు... రుణం కోసం ఆశగా ఎదురు చూసే పరిస్థితులు. విపక్షాల ఆరోపణలు. ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రం. కేంద్రం ఇచ్చే నిధులే ప్రస్తుతం రాష్ట్రానికి అండ దండ. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఆంధ్రప్రదేశ్ కాస్తా రుణాంధ్ర ప్రదేశ్‌గా మారిందని ఇప్పటికే విపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అత్యంత వివాదంగా మారింది. గోదావరి నది నుంచి ప్రతి ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంది. దీనిని వూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఏపీ సర్కార్. దీనికి పూర్తిగా కేంద్రమే నిధులు సమకూరుస్తోంది. అయితే గోదావరి - కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఫెర్రీ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తోంది. దీని నిర్మాణంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీక ఎన్నో విమర్శలు కూడా చేసింది. ప్రజాధనం వృధా చేశారంటూ గగ్గోలు పెట్టారు కూడా. అలాంటి వైసీపీ... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.... కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్మాణ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే పట్టిసీమ ఉండగా... మరో కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని కూడా ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థకే కట్టబెట్టింది. ఏకంగా 765 కోట్ల రూపాయలతో మరో లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. కొత్త లిఫ్ట్ నిర్మాణం వద్దని ఇప్పటికే రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస పరిహారం అందలేదు. ఈ సమయంలో కొత్త లిఫ్ట్ కోసం నిధులు ఎలా తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: