ప్ర‌స్తుతం ఏపీ ఉన్న ప‌రిస్థితిలో టీడీపీ అదినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌స‌రం ఎంత ఉంది?  ఆయ‌న మ‌ళ్లీ ముఖ్యమం త్రి అయితే.. చూడాల‌ని ఎంత మంది అనుకుంటున్నారు? ఓ వ‌ర్గం మీడియా.. వ్య‌క్తులు, నాయ‌కులు చెబుతున్న‌ట్టు.. చంద్ర‌బాబు వ‌స్తేనే త‌ప్ప‌.. ఏపీ బాగుప‌డ‌దా?  ఇలాంటి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అనేకం కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిని ఎవ‌రు ప్ర‌చారం చేస్తున్నారు? ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారు?  ఒపీనియ‌న్ పోల్ కోసం ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. వాస్త‌వానికి ఏపీకి ఇప్పుడు చంద్ర‌బాబు అవ‌స‌రం ఉందా? అనేది మాత్రం ఖ‌చ్చితంగాచ‌ర్చ‌కు వ‌స్తున్న అంశ‌మే. దీనిపై నెటిజ‌న్లు 50ః50గా స్పందించారు.

అంటే.. కొంద‌రు ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు అవ‌స‌రం రాష్ట్రానికి ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా.. మిగిలిన వారు.. చంద్ర‌బాబు వ‌చ్చినా.. రాష్ట్రాన్ని బాగు చేయ‌డం సాధ్యం కాద‌నే అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? అంటే.. న‌వ్యాంధ్ర ఏర్ప‌డిన‌ప్పుడు.. చంద్ర‌బాబు ఏపీని అభివృద్ధి ప‌థంంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించార‌న‌డంలో సందేహం లేదు. రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటు స‌హా.. విశాఖ‌ను ఐటీ న‌గరంగా తీర్చిదిద్దేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. దీంతో ఆయ‌న‌ను అభివృద్ధికి ఐకాన్‌గా చూడ‌డం ప్రారంభ‌మైంది. అయితే.. కీల‌క‌మైన హోదా, పోల‌వ‌రం వంటి విష‌యాల్లో చంద్ర‌బాబు వేసిన అడుగులు వ్య‌తిరేక ఫ‌లితాన్ని ఇచ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూడ‌డం చంద్ర‌బాబు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేదు.

దీంతో గ‌త ఎన్నిక‌ల్లో భారీ తేడాతో అధికారం నుంచి దిగిపోయినా.. ఓట్లు ప‌రంగా చూసుకుంటే.. 50 శాతం అనుకూలంగానే ఉంది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితిని చూసుకుంటే.. రాష్ట్రంలో సంక్షేమం పేరిట‌.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతున్న ప్ర‌భుత్వంపై సానుభూతి పోయిందనే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రం అబివృద్ధి చెందితే.. నిధులు దానంత‌ట అవే వ‌స్తాయ‌ని.. కానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేద‌నేది నెటిజ‌న్ల మాట‌. ఇది ప‌క్క‌న పెడితే.. మిగిలిన విష‌యాల‌ను చూసుకుంటే.. ఫీల్ గుడ్ స‌ర్కారుగా జ‌గ‌న్ కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. అయితే.. అవినీతి అంతం అనేది కేవ‌లం కాయితాల‌కే ప‌రిమిత‌మైంద‌నేది మ‌ధ్య‌వ‌ర్గాల మాట‌. అదేస‌మ‌యంలో కేవ‌లం ప్ర‌భుత్వం పేద‌ల‌కు అనుకూలంగా ఉందే త‌ప్ప‌.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న కూడా క‌నిపిస్తోంది.

వెర‌సి.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. చంద్ర‌బాబును సీఎం చేయాల‌ని అనుకునేవారు ఎంత మంది ఉన్నారో.. జ‌గ‌న్ మ‌రోసారి సీఎం అయితే.. బాగుంటుంద‌నేవారు కూడా అంతే మంది క‌నిపిస్తున్నారు. ఇదే విష‌యం నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో పెడుతున్నారు. పైగా.. జ‌గ‌న్‌కు వార‌సులు లేరు. అంటే.. ఆయ‌న త‌ర్వాత‌.. సీఎంగా అధికారంలోకి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చేందుకు ఎవ‌రూ లేరు. పైగా.. జ‌గ‌న్‌కు ఇంకా చాలా వ‌య‌సుంది. చంద్ర‌బాబునుచూస్తే.. వ‌య‌సు మీద‌ప‌డింద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాబును సీఎంగా చూడాల‌నేవారు.. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను మ‌రోసారి సీఎంను చేయాల‌నే వారు కూడా 50ః 50గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: