వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట వంటి క‌డ‌ప జిల్లాలో టీడీపీ పుంజుకోవాల‌నేది ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆశ‌. అయితే.. ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. కొన్నాళ్లుగా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూస్తున్న‌వారు కూడా ఇదే మాట చెబుతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి కేడ‌ర్ లేకుండా పోయింది. ఉన్న‌వారు కూడా బీజేపీలోకి జంప్ చేశారు. అయితే.. బీజేపీలోకి వెళ్లిన వారంతా.. చంద్ర‌బాబు కను స‌న్న‌ల్లోనే ప‌నిచేస్తున్నార‌ని.. వారు అక్క‌డే ఉన్నా.. వారి ఆత్మ‌లు మాత్రం టీడీపీలో ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. బ‌హిరంగంగా .. బీజేపీ లో ఉంటూ.. టీడీపీకి ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ క్ర‌మంలో తాజాగా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయం రచ్చ‌కెక్కేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ ఇక్క‌డ తాజాగా భూపేష్‌రెడ్డికి ఇంచార్జ్ ప‌ద‌విని అప్ప‌గించింది. అయితే.. ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని.. మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. అంటే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ నుంచి మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేస్తార‌నేది ఆయ‌న వ‌ర్గం చెబుతున్న మాట‌. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న సోద‌రుడు దేవ‌గుడి నారాయ‌ణరెడ్డి చ‌క్రం తిప్పారు. త‌న కుమారుడు భూపేష్‌కు టికెట్ ఇస్తామంటేనే.. పార్టీలో యాక్టివ్ అవుతామ‌ని.. ష‌ర‌తు పెట్ట‌డంతో.. చంద్ర‌బాబు ఇక్క‌డ ఇంచార్జ్‌గా భూపేష్‌కు చాన్స్ ఇచ్చార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

దీంతో ఆదినారాయ‌ణ రెడ్డి ర‌గిలిపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు.. త‌నను రాజ‌కీయంగా ఇబ్బందికి గురి చేసి.. క‌డ‌ప ఎంపీగా పోటీ చేయించార‌ని.. తాను గెల‌వ‌లేన‌ని చెప్పినా.. ఆయ‌న విన‌లేద‌ని.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. తాను జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేసి విజ‌యంద‌క్కించుకునేందుకు రూట్ రెడీ చేసుకుంటే.. భూపేష్‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఏంట‌ని ఆయ‌న రగిలిపోతున్నారు.కానీ, ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేదు.

ఎందుకంటే.. ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న భూపేష్‌.. ఆది త‌మ్ముడి కొడుకుకావ‌డం. పైగా.. తాను బీజేపీలో ఉండ‌డం. ఈ రెండు కార‌ణాల‌తో ఆయ‌న ఇబ్బందిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌ను ఆయ‌నే మేనేజ్ చేస్తున్నార‌ని.. తాను త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటాన‌ని.. మీరు నా వెంటే ఉండాల‌ని ఆయ‌న తెర‌చాటు సందేశాలు పంపుతున్నారు. దీంతో ఇంచార్జ్ మారినా.. టీడీపీ ప‌రిస్థితి మాత్రం మారేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: