ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. మధ్యలో ఎంట్రీ ఇచ్చే మిగతా పార్టీలకు అంత సీన్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ ఆరాధ్యుడిగా భావించిన కోదండరాంని సైతం ఆ తర్వాత తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజకీయ శూన్యత లేని ఈ సమయంలో పార్టీ పెట్టి సాహసం చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇప్పటి వరకూ షర్మిల పార్టీకి ఆమే అన్నీ. పార్టీ పెట్టినప్పటినుంచి ఆమెతో ఉన్న ఇందిరా శోభన్ ఇటీవలే బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆ స్థాయిలో కీలక నేతలెవరూ పార్టీలో లేరు. కొత్తగా ఎవరైనా వస్తారా అనేది సందేహమే. ఈ దశలో షర్మిల పాదయాత్ర చేపట్టారు. చేవెళ్లనుంచి మొదలయ్యే ఈ యాత్రలో ఆమె ప్రధానంగా వలసలపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

గతంలో వైఎస్ఆర్ పై అభిమానం ఉన్న వారందర్నీ ఈ పాదయాత్ర ద్వారా ఆకర్షించి పార్టీ సానుభూతిపరులుగా మార్చుకోవడం షర్మిల ప్రధాన లక్ష్యం. అంతే కాదు.. నియోజకవర్గ స్థాయి నేతల్ని కూడా గుర్తించడానికే ఆమె ఈ యాత్ర చేపట్టారు. రాబోయే రోజుల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడగలిగేవారు ఎవరు.. ? ఎక్కడెక్కడ తమ పార్టీపై ప్రజల్లో అభిమానం ఉంది. తాను పిలుపునిస్తే ఎంతమంది కలసి వస్తారు? ఎంతమంది తమవైపు నిలబడతారు అనే విషయాలపై ఆమె ఈ యాత్రలోనే ఓ అంచనాకు రాబోతున్నారు.

పాదయాత్ర అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఎన్నికల హడావిడి లేని ఈ సమయంలో షర్మిల పాదయాత్ర మొదలు పెడితే ఎవరు ఆమెతో కలసి వస్తారనేదే ప్రధాన సమస్య. అయితే టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ, కుదరకపోతే కాంగ్రెస్ అనేలా ఉన్నారు నియోజకవర్గ స్థాయి నేతలు. కళ్లముందు అన్ని ప్రత్యామ్నాయాలు కనపడుతున్నప్పుడు ఇక వైఎస్సార్టీపీలో చేరేందుకు ఎవరు ఆసక్తి చూపిస్తారు..? వీటన్నిటికీ షర్మిల పాదయాత్రలో సమాధానాలు తెలియబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: