దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ కన్నెసింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని బలంగా భావిస్తోంది హస్తం పార్టీ. దాదాపు ఏడాది కాలంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు... ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం టికెట్లను పూర్తిగా మహిళలకే కేటాయించనున్నారు. ఈ విషయాన్ని పార్జీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా స్వయంగా ప్రకటించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని వ్యాఖ్యానించిన ప్రియాంకా.... మహిళలే రాజకీయంగా కూడా మార్పు తీసుకురాగలరని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందన్న ప్రియాంకా... ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాందీ పలుకుతోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలనే మహిళలకు కేటాయిస్తామన్నారు. అటు ప్రభుత్వ ఏర్పాటులో కూడా మహిళలదే కీలక పాత్ర అన్నారు.

ఇప్పటికే యూపీ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ప్రియాంకా గాంధీ వాద్రా పేరు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రియాంకా గంగా నదిలో 12 వేల కిలోమీటర్ల పొడవైన బోట్ ర్యాలీ నిర్వహించారు. అలాగే యూపీలో ఏ చిన్న ఘటన జరిగినా కూడా... కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు ప్రియాంకా. తాజాగా లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు యత్నించిన ప్రియాంకా గాంధీని అనుమతి లేదంటూ యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 48 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లోనే నిర్భందించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ప్రియాంక ఆరోపించారు. మహిళలు, బాలికల రక్షణ కోసమే 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు మార్పు తీసుకురాగలరని బలంగా నమ్ముతున్న పార్టీ కాంగ్రెస్ అని ప్రియాంక వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ప్రియాంక గాంధీ వాద్రా ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: