2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందిగానే మారింది. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే టీడీపీ ఖాతాలో చేరాయి. పార్టీ తరఫున ముగ్గురు ఎంపీలు మాత్రమే పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ఫలితాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగానే ఉంది. ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లో చేరడం... వరుస కేసులు, కార్యకర్తలపై దాడులు... ఇలా ఎన్నో సమస్యలు తెలుగుదేశం పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసింది. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పొరుగు రాష్ట్రంలో నివాసం ఉండటం... హైదరాబాద్ ఇంటి నుంచి ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా రావడం కూడా అధికార పార్టీకి అస్త్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతల సూచనల మేరకు... చివరికి పార్టీ ని గాడిలో పెట్టేందుకు అధినేత సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ.... నిరసనలు, ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు చంద్రాబాబు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. రాజకీయ దాడులతో రాష్ట్రంలో రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది. కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడి జరగడం... తెలుగుదేశం పార్టీకి కొంత మైలజ్ తీసుకువచ్చినట్లుగానే కనిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. రాజకీయ విమర్శలు సర్వ సాధారణం తప్ప... దాడులు జరగడం మాత్రం తొలిసారే. ఇలా దాడి చేయడంపై ప్రతిపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ముందుగా నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు... ఇప్పుడు కార్యాలయాలపై దాడి చేయడం ఏమిటంటున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రజల్లో సానుభూతి సాధించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: