ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుంది. బీభత్సమైన వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్రంలోని అన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అన్ని నదుల వద్ద కూడా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వరద నీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరద నీటి ముంపులో చిక్కుకున్నాయి. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడటంతో.... రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్ల పై కప్పులు లేచి పోయాయి. ఇప్పటికే వరదల కారణంగా సుమారు 30 మంది మరణించారు. వందల మంది గల్లంతయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను రక్షిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్‌ జిల్లా వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నైనిటాల్ సరస్సు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నైనిటాల్ సరస్సు కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోతున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. వీరిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. భారీ వరద నీటికి రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. గౌలా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే గౌలా నదిపై హల్ద్వానీ ప్రాంతంలో నిర్మించిన వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇక చంపావత్ ప్రాంతంలోని కూడా చల్తీ నదికి వరద నీరు పొటెత్తింది. నదిపై నిర్మించిన వంతెన పూర్తిగా కూలిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: