కేంద్రంలో ప్ర‌స్తుతం ఎన్డీయే ప్ర‌భుత్వం ఉంది. నిజానికి బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు త‌న‌తో క‌లిసి వ‌చ్చిన ప్ర‌తిపార్టీకీ.. మోడీ అవ‌కాశం క‌ల్పించారు. దీంతో బీజేపీకి ఫుల్లు మెజారిటీ ఉన్నా.. ఎన్డీయేనే కేంద్రంలో కొన‌సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఏపీలోని వైసీపీని కూడా వ‌చ్చి చేరాలంటూ.. మోడీ ఆహ్వానిస్తున్న‌ట్టుగా సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి నేరుగా పొత్తులేకున్నా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కేంద్రం తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యాన్నీ జ‌గ‌న్ స్వాగ‌తిస్తున్నారు.

అదేస‌మ‌యంలో ప‌లు చ‌ట్టాల‌కు రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. నిజానికి రైతు నూత‌న సాగు చ‌ట్టాల విష‌యంలో ఎన్డీయేలో కూట‌మిగా ఉన్న పార్టీలే త‌ప్పుకొన్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ పార్టీ ఎంపీలు మాత్రం రాజ్య‌స‌భ‌లో మోడీకి మ‌ద్ద‌తు తెలిపారు. ఇలా.. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ మోడీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు.అయితే.. ఇప్ప‌టి నుంచే మోడీ ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో లేదా.. జ‌మిలి ఎన్నిక‌ల్లో.. తిరిగి గెలిచి.. మ‌ళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని.. ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఇప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌తిబంధంకంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మోడీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముంద‌డుగులు వేస్తోంది. దీనిలో భాగంగా.. వ‌చ్చే ఎన్నిక‌లకు ముందుగానే జ‌గ‌న్ వంటి బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ నాయ‌కుల‌తో మిత్ర‌త్వం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావ‌లే.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. జ‌గ‌న్ ఎన్డీయేలో చేరాల‌ని.. దీనిపై తాను కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతాన‌ని.. ఆయ‌న చెప్పారు. వాస్త‌వానికి ఈ విష‌యంలో స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం అథావ‌లేకు లేదు. పైగా.. ఆయ‌న బీజేపీ నాయ‌కుడు కూడా కాదు.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌ను ఎన్డీయేలోకి ఎందుకు ఆహ్వానించిన‌ట్టు ? అనేది ప్ర‌శ్న‌. దీనిని కొంచెం త‌ర‌చి చూస్తే.. దీనివెనుక ప్ర‌ధాని మోడీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని.. తెలుస్తోంది. అంతేకాదు.. ఎన్డీయేలోకి చేరితే త‌ప్ప‌.. రాష్ట్రానికి నిధులు రావ‌ని.. పోల‌వ‌రం పూర్తికాద‌ని.. అన్నారు. జ‌గ‌న్ క‌లలు(మూడు రాజ‌ధానులు కావొచ్చు) నెర‌వేరాలంటే.. ఆయ‌న ఎన్డీయేలోకి రావాల‌ని అన్నారు. సో.. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఎన్డీయేలోకి జ‌గ‌న్ వ‌స్తేనే త‌ప్ప‌.. ! అనే కండిష‌న్ క‌న‌బ‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇక‌, జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: