గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణా సిఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలన్న కేసీఆర్, ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

సుదీర్గ పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం అని  అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం అని తెలిపిన ఆయన మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలలోని మారుమూల  గ్రామాలకు సైతం పరిశుభ్ర జలాలందిస్తున్నాము అని ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలలో 99 శాతం సంస్థలు మనదగ్గర భారీ పెట్టుబడులను పెడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం అని అన్నారు. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి అని ఆయన తెలిపారు.

ఒక వైపు  రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది అని ఆయన హెచ్చరించారు.  ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి అని స్పష్టం చేసారు. ఎంతో ఆవేదనతో నేను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాను అని పేర్కొన్నారు.  

పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్ లు అందజేసుకుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు అని అన్నారు కేసీఆర్.  అమాయకులైన యువకులు తెలిసీ తెలియక వీళ్ల బారిన పడుతున్నారు అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం వుంటుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ అని  దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: