పవర్ మ్యాజిక్ అలాంటిది మరి. వారు వీరు అవుతారు. తమకంటే ఎవరూ గొప్పవారు కాదనుకుంటారు. అధికారం అనేది ఒక గమ్మత్తు. ఏపీలో చూసుకుంటే అదే జరుగుతోందా అన్న చర్చ అయితే ఉంది. ఎందుకంటే నాడు టీడీపీ ఏం చేసిందో నేడు వైసీపీ కూడా అదే చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళ పాలనలో విపక్షం మీద నిర్భంధం ఉండేది. ఎక్కడికక్కడ అరెస్టులు అడ్డుకోవడాలు నాడు జరిగాయి. 2017లో రిపబ్లిక్ డే వేళ విశాఖలో ప్రత్యేక హోదాకు మద్దతుగా ర్యాలీకి హాజరుకావాలని నాటి విపక్ష నేత జగన్ భావిస్తే ఆయన్ని విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకుని అటునుంచి అటే విమానంలో పంపేశారు. ఇక జగన్ మీద అదే విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగింది.

దానికి ముందు ఆయన పర్యటలనలు కూడా అడ్డుకుంటారు. ఇక ఏపీలో నాడు బంద్ లకు కూడా అనుమతులు ఉండేవి కావు. ఇలా చంద్రబాబు జమానాలో ఒక రకమైన ఇబ్బందులు విపక్షాలు అనుభవించేవి.  ఇక బీజేపీతో టీడీపీకి  బంధం తెగిపోయాక అమిత్ షా తన కుటుంబంతో తిరుమల దర్శనానికి వస్తే టీడీపీ క్యాడర్ ఆయన మీద రాళ్ళు రువ్విందని బీజేపీ వారు ఇప్పటికీ ఆరోపిస్తారు. ఇక మోడీ ఏపీకి వస్తే ప్రధాని అని కూడా చూడకుండా నల్ల జెండాలు, కుండలతో స్వాగతం పలికారు. అలా నాడు అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ గట్టిగానే వ్యవహరించింది.

దాని ఫలితం కూడా 2019 ఎన్నికల్లో అనుభవించింది. మరి అన్నీ తెలిసి కూడా ఇపుడు జగన్ అలా చేయడమే ఆశ్చర్యంగా ఉంది అని అంతా అంటున్నారు. జగన్ కూడా విపక్షాలను అడ్డుకుంటున్నారని, వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబు ఇంటి మీద దాడితో పాటు ఇపుడు ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే పరాకాష్టగా చూడాలి అంటున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా జనాల్లో ఆయా ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత వచ్చేలా చేస్తాయని గత అనుభవాలను రుజువు చేశాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే వైసీపీ కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: