"వైసీపీ నేతలు బూతులు మాట్లాడితే ఒక లెక్క.. టీడీపీ నేతలు మాట్లాడితే మరో లెక్క.." అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తీరు ఉందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లో సైతం వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ బుధవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో సీఎం జగన్‌ మాట్లాడారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరూ మాట్లాడని బూతులను విపక్ష టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడలేదని జగన్ అన్నారు. అయితే సీఎం జగన్ అలా అనడంతో.. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో, దూషణలతో, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన దుర్భాషలతో వల్లించిన బూతులు ఇవి అంటూ... కొందరు నెట్టింట్లో పోస్టులు, వీడియోలు పెట్టారు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. నెట్టింట జోరుగా చక్కర్లు కొట్టాయి. "జగన్ సూక్తి.. వైసీపీ నేతల సుభాషితాలు..", వైసీపీ ప్రజాప్రతినిధుల బూతుల పంచాంగం" అని వాటికి క్యాప్షెన్లు పెట్టారు. వైసీపీ నేతల బూతు పురాణం ఇదీ అని సెటైరికల్‌గా, విమర్శనాత్మకంగా ట్రోల్‌ చేశారు.

ముఖ్యంగా చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దూషణలు, దుర్భాషలతో కూడిన కామెంట్లు ఎక్కువగా ట్రోల్‌ అవుతున్నాయి. ఈ వరుసలో ముందుగా మంత్రి కొడాలి నానిని హైలైట్‌ చేశారు. "నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి.." అంటూ కొడాలి నాని చేసిన కామెంట్‌ను ట్రోల్‌ చేశారు. ఆయనతో పాటు గతంలో జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన కామెంట్లను వైరల్‌ చేశారు. ఇక ఇటీవలి కాలంలో మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌, మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జోగి రమేష్‌లు ఇటీవలి కాలంలో రాయకూడని భాషలో, చెప్పకూడని విధంగా చేసిన వ్యాఖ్యలు, మాటలతో కూడిన వీడియోలను సోషల్‌ మీడియోలో పోస్ట్ చేశారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. వైసీపీ నేతల బూతు పురాణం ఇదీ అంటూ కొందరు ఆ వీడియోలను నెట్టింట ఉంచడం చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీ నేతలు బూతులు మాట్లాడితే ఒక లెక్క.. ప్రతిపక్ష టీడీపీ నేతలు అదే స్థాయిలో మాట్లాడితే మరో లెక్కనా..? అని రాజకీయ వర్గాల వారితోపాటు సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: