ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోటి నుంచి మూడు రాజధానుల మాట వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. అలుపెరుగకుండా అమరావతి నినాదాన్ని మార్మోగిస్తూనే ఉన్నారు. అక్రమ కేసులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. అదరలేదు, బెదరలేదు. ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతుల్లో ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. అమరావతి పోరాటాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధాని ప్రాంతంలో అక్రమాలనూ నిలదీస్తూనే ఉన్నారు. 673 రోజులుగా రైతులు, మహిళలు, రైతు కూలీల పోరాటానికి 13 జిల్లాల ప్రజలూ  మద్దతుగా నిలిచారు.  దీంతో ఉద్యమాన్ని రాష్ట్రం నలుమూలలకు చేర్చేందుకు.. తమకు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు రైతు మహా పాదయాత్రకు అమరావతి రైతులు సిద్ధం అవుతున్నారు.

వచ్చే నెల నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్‌ 17వ తేదీ వరకు అమరావతి రైతు మహా పాదయాత్ర కొనసాగనుంది. నేలపాడులోని హైకోర్టు నుంచి తిరుమల  శ్రీవారి దేవస్థానం వరకు నిర్వహించే రైతు మహా పాదయాత్రలో వందలాది మంది రైతులు పాల్గొంటారని అమరావతి జేఏసీ చెబుతోంది. ప్రతిరోజూ 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. హైవేలు, పట్టణాల మీదుగా కాకుండా పల్లెల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. అమరావతి ప్రాధాన్యతను, అవసరాన్ని.. గ్రామాల్లో రైతులు వివరించనున్నారు. మూడు రాజధానుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకు ప్లాన్ చేశారు. డిసెంబర్‌ 17వ తేదీన తిరుపతి చేరుకొని అమరావతికి అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమరావతికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు, మేధావులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించనున్నారు.

అమరావతి రైతు మహాపాదయాత్రకు సన్నాహకంగా ఈ నెల 17వ తేదీ నుంచి గ్రామాల్లో  రైతు చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే వెంకటపాలెంలో చైతన్య యాత్రలను  రైతులు ప్రారంభించారు. మందడం గ్రామంలో చైతన్య యాత్రను నిర్వహించారు. రాజధాని ప్రాంతం నుంచి  వందలాది మంది రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమం మరికొన్ని రోజుల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో.. ఉద్యమానికి ఊపునిచ్చేలా చేపట్టిన "అమరావతి రైతు మహా పాదయాత్ర" ఎలా సాగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: