రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య రాజకీయం వల్ల దేవినేని ఫ్యామిలీలో చిచ్చు చెలరేగినట్లు కనిపిస్తోంది. తాజాగా టి‌డి‌పి అధికార ప్రతినిధి పట్టాభి...డ్రగ్స్, గంజాయి విషయంలో జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అలాగే జగన్‌ని నోటికొచ్చినట్లు తిట్టేశారు. దీంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్న టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేశాయి. అలాగే పట్టాభి ఇంటిపై దాడులు చేశారు. ఇటు మంగళగిరిలో టి‌డి‌పి కేంద్ర కార్యలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశాయి...అక్కడ ఉన్న టి‌డి‌పి కార్యకర్తలపై భౌతికంగా కూడా దాడి చేశారు.

ఇక దాడికి నిరసనగా చంద్రబాబు బంద్‌కు పిలుపునిచ్చారు. అటు వైసీపీ శ్రేణులు కూడా నిరసనలు తెలియజేస్తున్నాయి. అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ రచ్చ రాజకీయం దేవినేని ఫ్యామిలీలో చిచ్చుకు కారణమైంది. టి‌డి‌పి ఆఫీసు, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిలో వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులు కూడా ఉన్నారని టి‌డి‌పి శ్రేణులు చెబుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్‌లకు చెందిన అనుచరులు కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే టి‌డి‌పి నేత దేవినేని చందు... వైసీపీలో ఉన్న తన అన్న దేవినేని అవినాష్‌పై ఫైర్ అయ్యారు. అవినాష్...దేవినేని కుటుంబం పరువు తీశారని, ఎన్టీఆర్ తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పే అవినాష్...దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుపై దాడికి తన అనుచరులని పంపడం దారుణమని అన్నారు. లోకేష్ సైతం అవినాష్‌ని తమ్ముడుగా చూసుకునేవారని, అవినాష్‌కు టి‌డి‌పి చాలా చేసిందని, అయినా సరే అన్నీ మర్చిపోయి టి‌డి‌పి ఆఫీసుపై దాడి చేయించిన అవినాష్ రాజకీయ భవిష్యత్తు శూన్యం కానుందని అన్నారు. అంటే వైసీపీ-టి‌డి‌పిల మధ్య రచ్చ రాజకీయం...కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా ఉంది. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp