తెలంగాణ రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, రైతు బీమా రద్దు చేయాలని నిర్ణయించారు. గంజాయిపై సీరియస్ గా వ్యవహరించాలన్నారు. గంజాయి సాగు చేస్తే.. వారి పట్టాలు సైతం రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇక పాఠ్యపుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదాలపై పాఠాలు పెట్టాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు యుద్ధం ప్రకటించాలన్నారు సీఎం కేసీఆర్. దీనిపై ప్రత్యేక రివ్యూ చేపట్టిన సీఎం.. పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని సూచించారు. డ్రగ్స్ తో తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని.. వాడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రత్యేక అధికారిని నియమిస్తూ..నిఘా పెట్టాలని ఆదేశించారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ పై దృష్టి పెట్టాలన్నారు. గంజాయి రహిత తెలంగాణే లక్ష్యంగా సాగాలన్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడే ప్రధాన లక్ష్యంగా..  పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సీఎస్, డీజీపీ, డ్రగ్స్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఎక్సైజ్ అధికారుల నుండి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో పరిస్థితులు, డ్రగ్స్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు.

ఇక దళిత బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పారు సీఎం కేసీఆర్. దళిత బంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఎన్నో రోజులు ఆపలేదని ముఖ్యమంత్రి అన్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు పూర్తి కాగానే 4వ తేదీన దళిత బంధు డబ్బులను స్వయంగా అందజేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. తాను మొదు పెట్టిన ఏ కార్యక్రమాన్ని మధ్యలో ఆపేయ్యలేదనీ.. అలాగే దళిత బంధు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. అర్హులు ఆందోళన చెందవద్దని సూచించారు.






మరింత సమాచారం తెలుసుకోండి: