చాలా కాలం త‌రువాత దీక్ష‌ల‌కు సంబంధించి ఓ స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం వ‌చ్చింది. చంద్ర‌బాబు త‌న హ‌యాంలో అధికారం న‌డ‌ప‌గా జ‌గ‌న్ దీక్ష‌లు చేసి పేరు తెచ్చుకునేందుకు, గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ తాప‌త్ర‌య‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొన్ని దీక్ష‌ల‌తో ప్ర‌త్యేకంగా శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఇప్పుడిదే పంథాను ఎంచుకుని త‌న వ‌ర్గంకు చెందిన మ‌నుషుల్లో విశ్వాసం ఇచ్చేందుకు 70 ఏళ్ల ప్రాయాన చంద్ర‌బాబు ఆరాట‌ప‌డుతున్నారు. ఉద్రిక్త‌త‌ల న‌డుమ ఉద్య‌మ పంథాకు ప్రాముఖ్యం ఇచ్చి, వైసీపీపై మ‌రింత  ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.


టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేయ‌నున్నారు. త‌మ‌పై మాట‌ల దాడికి పాల్ప‌డుతున్న వైసీపీ శ్రేణులు, అక్క‌డితో ఆగ‌క భౌతిక దాడుల‌కు సైతం పాల్ప‌డుతున్న వైనం త‌న‌కు క‌ల‌వ‌ర‌పాటుగా ఉంద‌ని, ఈ ద‌శ‌లో పార్టీని కాపాడుకునేందుకు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌నో నిబ్బ‌రం ఇచ్చేందుకు దీక్ష‌కు ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని బాబు అంటున్నారు. ఈ మేర‌కు స‌న్నిహిత వ‌ర్గాల‌తో ఆయ‌న మాట్లాడి, దీక్ష‌కు సంబంధించి జిల్లాల‌కు చెందిన కార్యవ‌ర్గాల‌ను కూడా స‌మాయ‌త్తం చేస్తున్నారు. అదేవిధంగా ప‌ట్టాభి కుటుంబానికి నైతికంగా మ‌ద్ద‌తుగా ఉండాల‌ని శ్రేణుల‌కు పిలుపు ఇచ్చారు.


రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను నిర‌సిస్తూ 36 గంట‌ల దీక్ష‌ను చేప‌ట్ట‌నున్నారు చంద్ర‌బాబు. ఈ మేర‌కు ఆయ‌నో నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ప‌ట్టాభి అరెస్టు త‌దిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న దీక్ష‌కు ప్రాధాన్యం పెంచార‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబుకు పోటీగా ధ‌ర్మాగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతూ వైసీపీ దీక్ష‌లు చేయాల‌ని భావిస్తోంది. త‌మ‌దే న్యాయం అని చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి వైసీపీ చేయాల‌ని స్థిర అభిప్రాయంలో ఉంది. ఇప్పుడు రెండు వ‌ర్గాలు నిర‌శ‌న శిబిరాల ఏర్పాటుకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ పై అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న అధికార ప‌క్షం నుంచి ఆరోప‌ణ‌లు ఇంకొన్ని  వినిపిస్తున్నాయి. వీట‌న్నింటిపై టీడీపీ మాట్లాడాల‌ని వైసీపీ ప‌ట్టుబ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు వ‌ర్గాలూ నువ్వెంత అంటే నువ్వెంత అన్న ధోర‌ణిలో ప‌ర‌స్ప‌ర క‌య్యాల‌కు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ద‌గ్గ‌ర్లో ఎన్నిక‌లు ఉన్నాయో లేవో కానీ ఇరు వ‌ర్గాల కోపాలూ మ‌రియూ తాపాలూ ఏ స్థాయికి చేర‌నున్నాయో?



మరింత సమాచారం తెలుసుకోండి: