ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో ప్రతిపక్షంపై జనాల్లో కాస్తో కూస్తో సింపతీ పెరిగిన మాట వాస్తవం. అయితే అదే సమయంలో సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యల్ని కూడా సామాన్యులు తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ నేతలు, మంత్రులు గతంలో చేసిన పరుష వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే దాదాపుగా నాయకులెవరూ మంచి మాటలు మాట్లాడటం లేదని, మంచి, మర్యాద అనేది ఎప్పుడో మరచిపోయారనేది పూర్తిగా స్పష్టమవుతోంది. మరిప్పుడు కొత్తగా తిట్లు, తిట్లకు అర్థాలు, నానార్థాలు వెదుక్కోవడం ఎందుకు..?

పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అనుకుంటే ఆయనపై అప్పుడే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. అయితే టీడీపీ ఆఫీస్ లపై దాడులు, తదనంతర పరిణామాల తర్వాత ఇప్పుడు పట్టాభిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మరింతగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. రాజకీయ కక్షతోనే పట్టాభిని అరెస్ట్ చేశారని అంటున్నారు. మరోవైపు తనకేమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అంటూ పట్టాభి ఓ వీడియో విడుదల చేయడం కూడా సంచలనంగా మారింది.

సీఎంనే కాదు.. ఏ స్థాయి నాయకిడిని అయినా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎవరికీ మర్యాద కాదు. అయితే ఇటీవల కాలంలో తిట్లు కామన్ అయిపోయినమాట వాస్తవం. ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కనపడుతోంది. గొంగళిలో తింటూ.. వెంట్రుకలు ఏరుకోవడం అమాయకత్వం. అయితే ఈసారి అది కాస్త శృతి మించింది. పట్టాభి తిట్లతో వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. అదే సమయంలో పోటాపోటీగా ఇరు వర్గాలు నిరసనలకు దిగడంతో ఏపీలో ఏదో జరిగిపోతోందనే చర్చ మొదలైంది. పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రం ఈ దఫా నిందలు మోయాల్సి వస్తోంది. తిట్టడం, తిట్టించుకోవడం దాని ద్వారా ప్రజల్లో సింపతీ పెంచుకోవడం తద్వారా రాజకీయ లాభం పొందడం.. నాయకులకు అలవాటు కాగా.. మధ్యలో పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రం నలిగిపోవాల్సి వస్తోంది. మొత్తమ్మీద పట్టాభి అరెస్ట్ తో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: