రాష్ట్రంలో పోలీసుల పనితీరు మరోసారి విమర్శలకు తావిస్తోంది. 2019లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్ష నేతల పై దాడులు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కొంత మంది నేతలను టార్గెట్ చేసుకొని తప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయడం వంటివి పోలీసులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు కూడా. ఇందుకు గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ఉదహరిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్ పై దాడి జరిగిన సమయంలో పోలీసుల తీరును తప్పుబట్టారు. ఉమా పై దాడి చేసిన వారిని వదిలేసి తిరిగి ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేశారంటూ విమర్శించారు. ఇప్పుడు తాజాగా మరోసారి పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

2 రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభి ఇంటి పైన కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏమాత్రం స్పందన లేదంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా పోలీసుల చర్యలు కనిపిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి పట్టాభి ఇంటిదగ్గర మోహరించిన పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకెళ్లి ఆయన అరెస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి దాడికి గురైన బాధితులను ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులను టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడి ఎవరు చేశారు.. ఎలా జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి సిసిటివి ఫుటేజీ అందించినప్పటికీ... పోలీసులు మాత్రం అసలు నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారు అంటూ టిడిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: