రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడంతో ఆపార్టీ అధినేత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు ప్రజల్లోకి కూడా ఇదే అంశాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు చేస్తూ బంద్ చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలోని టీడీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేయడంతో బంద్ వాతావరణం కనిపించలేదు. దీంతో టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కి స్పందన అంతంతమాత్రమే అని తేలింది. దీంతో బంద్ తో పాటు.. ఇప్పుడు నిరసన దీక్ష అంటూ చంద్రబాబు మరో ప్రయత్నం మొదలు పెట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ జనాగ్రహ దీక్షలు మొదలు పెట్టడం విశేషం.

అయితే చంద్రబాబు ఈ దాడుల విషయంపై పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏకంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అందుకే 36 గంటల నిరవధిక నిరసన దీక్ష ప్రారంభిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే దీక్షకు కూర్చుంటున్నారు.  ఇదిలా ఉండగా సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలకు కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వైసీపీ నేతలు కూడా చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపడతామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతు పదాలతో విమర్శలు చేయడంపై వైసీపీ నేతలు కూడా గుర్రుగానే ఉన్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతీరుపై మండి పడుతున్నారు. ప్రతిపక్షం నిరసనలను తిప్పికొట్టేలా.. అధికార పార్టీ నేతలకు కూడా దీక్షలు గట్టిగానే దీక్షలు చేయాలని భావిస్తున్నారు. సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పేలా ఈ దీక్షలు కొనసాగించాలని అనుకుంటున్నారు. కనీసం రెండు రోజులపాటు జనాగ్రహ దీక్షలు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ పోటాపోటీగా నిరసన దీక్షలు చేస్తుండటం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: