ప్ర‌తి క‌థ‌లో ఉన్న విల‌న్ ఎక్క‌డో ఓ చోట ఆగిపోతాడు. హీరోనే అంతా తానై నిల‌బ‌డి, త‌న‌ని తాను నిరూపించుకుంటాడు. ఈ క‌థ‌లో కూడా విల‌న్ ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఆగిపోవాలి. కానీ ఇంకా ఇంకా కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఒక్కోసారి విల‌న్ హీరో అవుతున్నాడు. హీరో విల‌న్ అవుతున్నాడు. ఇదంతా ప‌ర‌స్ప‌ర అధికార మార్పిడిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు సంకేతం. అయినా కూడా మ‌నుషులు మార‌డం లేదు. నాయ‌క‌త్వాలూ మార‌డం లేదు. అందుకే రాష్ట్రాన్ని రూల్ చేస్తున్న పార్టీలు ఎప్ప‌టిక‌ప్పుడు అధికారం ద‌క్కించుకోవాలి అనే ఒకే ఒక్క సాకుతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి అన్న విమ‌ర్శ‌ల‌ను మూట గ‌ట్టుకుంటున్నాయి.

రాజ‌కీయం అంతా రివెంజ్ డ్రామా చుట్టూనే తిరుగుతుంది. డ్రామాను అర్థం చేసుకున్న‌వాడే హీరో అవుతాడు. లేదంటే విల‌న్ గానే మిగిలిపోయి, త‌న ప‌నులు తాను చ‌క్క‌బెట్టేందుకు కూడా క‌ష్ట‌ప‌డుతుంటాడు. ప్ర‌తికారేచ్ఛ అన్న‌ది ఒక‌నాడు వైఎస్ లో ఉంది. ఒక‌నాడు చంద్ర‌బాబులో ఉంది. అందుకే అసెంబ్లీ వేదిక‌గా ఒక‌రినొక‌రు తిట్టుకునే వారు. ఒక‌రిపై ఒక‌రు వాగ్బాణాలు సంధించుకునే వారు. ఆ త‌రువాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాడు. సుదీర్ఘ కాలం అధికారం కోసం ప‌రిత‌పించి, త‌పించి సీన్ లోకి జ‌గ‌న్ వ‌చ్చాడు. రావ‌డం రావ‌డంతోనే తానేంటో చెప్ప‌క‌నే చెప్పాడు.



అచ్చెన్న‌, చింత‌మ‌నేని లాంటి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను జైలుకు పంపాడు. అటుపై ఇంకొన్ని ప్ర‌తికారేచ్ఛ‌తో కూడిన ప‌నులేవో చేసి త‌న క్యాడ‌ర్ ద‌గ్గ‌ర మంచి మార్కులే కొట్టేశాడు జ‌గ‌న్. ఇప్పుడు జ‌గ‌న్ క‌న్నా చంద్ర‌బాబు ఎక్కువ అవ‌స్థ‌లు ప‌డుతున్నాడు. అధికారంలో లేన‌న్న బాధ‌, త‌న క‌న్నా చిన్న వాడ‌యిన జ‌గ‌న్ ను ఎదుర్కొన లేక‌పోతున్నానన్న దుఃఖం ఎక్కువ‌గా వెంబ‌డిస్తోంది చంద్ర‌బాబును. బాబు మార్కు రాజ‌కీయంలో గెలుపు,ఓట‌ములు ఉన్నా కూడా ఎన్న‌డూ ఇంత‌గా అవ‌మాన భారాలు మోసింది లేదు. ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ ఇలాకాలో ప‌డ‌రాని మాట‌లు అన్నీ ప‌డుతున్నాడు. త‌న క‌న్నా చిన్న‌వారితోనే మాట‌లు అనిపించుకుంటూ తెగ అవ‌స్థ భ‌రిస్తున్నాడు. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇస్తున్నా లోప‌లి బాధ మాత్రం ఎక్క‌డికి పోవ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp