ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గనుల సినరేజీ, ఫీజు వసూళ్లు ప్రయివేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యింది. చిన్న తరహా ఖనిజాల తవ్వకాల పై సినరేజీ, కన్సిడరేషన్ వచ్చే ఫీజులను ప్రయివేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 13 జిల్లాలోని గనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ఆరు ప్యాకేజీలకు 5880 కోట్ల రూపాయలకు రిజర్వ్ ధరగా ప్రభుత్వం ఖరారు చేసింది.


టెండర్ డాక్యుమెంట్ల పరిశీలన కోసం న్యాయ కమిషన్ పరిశీలన కోసం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పంపింది. న్యాయ కమిషన్ పరిశీలన తర్వాత ఈ ప్రైవేటుకు అప్పగింత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. ప్యాకేజీ- 1 లోకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి. ఈ ప్యాకేజీ వన్ రిజర్వ్ ధర 1056 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ప్యాకేజీ-2లోకి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు వస్తాయి.. ఈ ప్యాకేజీ 2 రిజర్వ్ ధర 485 కోట్లుగా నిర్ణయించారు.


ఇక మూడో ప్యాకేజీ కిందకు కృష్ణా-గుంటూరు జిల్లాలు వస్తాయి. ఈ రెండు జిల్లాలు ఉన్న ప్యాకేజీ మూడు రిజర్వ్ ధర 944 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇక నాలుగో ప్యాకేజీ కిందకు ప్రకాశం జిల్లా వస్తుంది. ఈ ప్యాకేజీ రిజర్వ్ ధర 1659 కోట్లుగా నిర్ణయించారు. ఐదో ప్యాకేజీ కిందకు  నెల్లూరు- చిత్తూరు జిల్లాలు వస్తాయి. ఈ ప్యాకేజీ రిజర్వ్ ధర 862 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఆరో ప్యాకేజీ కింద అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలు రాబోతున్నాయి. ఈ ప్యాకేజీ రిజర్వ్ ధర 876 కోట్లుగా నిర్ణయించారు.


ఇదీ ప్యాకేజీల ప్రతిపాదనల వివరాలు.. ఈ మేరకు డ్రాఫ్టు న్యాయ కమిషన్ వద్దకు చేరింది. దీన్ని న్యాయ కమిషన్ పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెబుతుంది. లేదంటే.. ఈ ప్యాకేజీలకు పచ్చజెండా ఊపుతుంది. అప్పటి నుంచి ఈ ప్యాకేజీలు అమల్లోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: