ప్రభుత్వ పనుల కోసం రిటైర్డ్ అధికారులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు.. కానీ.. ముఖ్యమంత్రులు తమకు కావలసిన వారిని.. తాము మెచ్చిన వారిని.. తాము లబ్ది చేకూర్చాలని భావించిన వారిని రిటైర్ అయ్యాక కూడా పిలిపించుకుని వారి సేవలు వినియోగించుకుంటారు. ఇది ఆ కోవలోకి వస్తుందో రాదో కాని.. ఏపీలో రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఒకరికి కీలక పదవి దక్కింది. అందులోనూ ఆ పదవి దక్కింది ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది చర్చనీయాంశమైంది.  


ఏపీ ట్రాన్స్ కో లో విజిలెన్సు జేఎండీగా విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డిని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏసీబీలో ఓఎస్డీగా సేవలందించిన మల్లారెడ్డిని ..
ఏపీ ట్రాన్స్ కో లో విజిలెన్సు జేఎండీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే సమయంలో మరికొన్ని నియామకాలు కూడా చేపట్టింది ప్రభుత్వం. ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్ జనరల్ సీహెచ్ శ్రీధర్ ను పునరావాస కమిషనర్ గా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

 
ఐఎఫ్ఎస్ అధికారి సునీల్ కుమార్ రెడ్డిని ఐటీ  శాఖలో ఎక్స్ అఫీషియో డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వంలో ఉన్న అధికారులను సక్రమంగా వినియోగించుకోకుండానే.. ఇలా రిటైర్ అయిన వారి సేవలు వినియోగించుకోవడంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఇలాంటి నియామకాల వల్ల కొత్త నోటిఫికేషన్లు ఆలస్యం అవుతాయని నిరుద్యోగులు చెబుతున్నారు.


మరో వైపు రిటైర్ అయిన వారి సేవలు వినియోగించుకోవడం కంటే.. కొత్తగా నియమించుకుంటే ఉద్యోగాల ప్రకటనలు కూడా పెరుగుతాయన్న విశ్లేషణ ఉంది. సీనియర్లను రిటైర్ అయ్యాక కూడా  ఎక్కువ జీతాలిచ్చి పెట్టుకోవడం కంటే.. ఫ్రెష్ ఉద్యోగులు తక్కువ జీతానికి దొరుకుతారు కదా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: