తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో లెక్కలేనన్ని హామీలు ఇచ్చేవి రాజకీయ పార్టీలు. అప్పట్లో టీవీలు, మిక్సీలు, డిష్ కనెక్షన్లు ఫ్రీ అంటూ తమిళనాడు హామీలు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారాయి. తాజాగా ఆ ప్రమోషన్ ని తలదన్నేలా యూపీలో కాంగ్రెస్ ప్రచారం సాగుతోంది. ఇక్కడ ఏకంగా స్మార్ట్ ఫోన్లు, స్కూటీలను కూడా ఉచితంగా ఇచ్చేస్తామంటూ ప్రియాంక గాంధీ హామీలు ఇచ్చేశారు.

యూపీలో అధికారం దక్కించుకోడానికి కాంగ్రెస్ శథవిధాల ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ.. కాంగ్రెస్ తో కలసి వచ్చేందుకు ససేమిరా అన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రతిపక్షాలు ఉన్నాయి. దీంతో అధికార బీజేపీ కాస్త ధీమాగా ఉంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేదని తేలిపోయింది. ఈ దశలో ఒంటరిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. ప్రియాంక గాంధీ అక్కడ కాంగ్రెస్ కి జవసత్వాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

లఖింపూర్ ఖేరీ ఘటన అనంతరం ప్రియాంక ఉత్తర ప్రదేశ్ లోనే మకాం పెట్టారు. అంతే కాదు.. అక్కడ పార్టీ తరపున ఆమె ప్రచార పర్వం మొదలు పెట్టారు. ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామంటూ సంచలన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తికర హామీలిచ్చారు. యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు ప్రియాంక గాంధీ. డిగ్రీ చదివే విద్యార్థినులకు స్కూటీలు ఉచితంగా ఇస్తామన్నారు. మొత్తమ్మీద స్కూటీలు, స్మార్ట్ ఫోన్ల హామీతో.. ప్రియాంక అందరి దృష్టినీ ఆకర్షించారు. యూపీలో కాంగ్రెస్ గెలుస్తోందో లేదో తెలియదు, ఒకవేళ మునుపటికంటైే ఎక్కువ సీట్లు సాధించినా అధికారం చేజిక్కించుకుటుందనే ఆశ లేదు. అయితే ఈ సమయంలో ప్రియాంక మాత్రం హామీలతో దూసుకెళ్తున్నారు. ఉచిత హామీలతో టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: