విజయనగరం జిల్లాపై బొత్స సత్యనారాయణకు ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు నాలుగైదు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది...ఆ నియోజకవర్గాల్లో తన వ్యక్తులని గెలిపించుకునే సత్తా ఉంది. గత ఎన్నికల్లో బొత్స....తన ఇమేజ్‌తో నాలుగైదు చోట్ల తన సన్నిహితులని వైసీపీ తరుపున గెలిపించుకున్నారు. ఇక ఇందులో బొత్స సోదరుడు అప్పలనరసయ్య కూడా ఒకరు.

మొదట నుంచి టి‌డి‌పికి అనుకూలంగా ఉన్న గజపతినగరం నియోజకవర్గాన్ని బొత్స ఫ్యామిలీ తమకు అనుకూలంగా మార్చేసుకుంది. తన అన్న బొత్సకు అండగా ఉంటూ వచ్చిన అప్పలనరసయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గజపతినగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేసి, 44 వేల ఓట్లు దక్కించుకున్నారు.

రాష్ట్రమంతా కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కకపోయినా సరే, చీపురుపల్లిలో బొత్సకు, గజపతినగరంలో అప్పలనరసయ్యకు మంచిగా ఓట్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత బొత్సతో పాటే అప్పలనరసయ్య వైసీపీలోకి వెళ్ళి, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఇలా అన్న సపోర్ట్‌తో గెలిచిన అప్పలనరసయ్య...గజపతినగరంలో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా దూసుకుపోతున్నారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో మంచి పనితీరు కనబరుస్తున్న వారిలో అప్పలనరసయ్య టాప్‌లో ఉంటారని చెప్పొచ్చు.

అటు టి‌డి‌పి నేత అప్పలనాయుడు...అప్పలనరసయ్యకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమవుతున్నారు. పైగా అప్పలనాయుడు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అప్పలనాయుడు ఫ్యామిలీలో కొందరు...పరోక్షంగా అప్పలనరసయ్యకు మద్ధతు ఇచ్చారు. ఇంకా ఇప్పటికీ అదే పరిస్తితి నడుస్తున్నట్లు ఉంది. అందుకే గజపతినగరంలో అప్పలనాయుడు ఏ మాత్రం బలపడలేకపోతున్నారు. దీంతో టి‌డి‌పి సైతం ఇక్కడ వీక్‌గా కనిపిస్తోంది. అయితే విభేదాలు పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తే, ఇక్కడ బొత్స సోదరుడుని అడ్డుకోవడం అప్పలనాయుడుకు సాధ్యమవుతుంది. లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ బొత్స తమ్ముడుని ఓడించడం కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP