పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే అల్లు అర్జున్  డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే అసలు ఆ డైలాగ్ నాదే అంటోంది పెట్రోల్ తగ్గేదేలే అంటోంది, దమ్ముంటే తగ్గించండి చూద్దాం అంటుంది. రోజు రోజుకి పెట్రోల్ ధర పైకి ఎగబాకుతూ నే ఉంది. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతూనే ఉంది. ఈరోజు కూడా పెట్రోల్ ధరలు మరొకసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్,డీజిల్ పై 35 పైసలు పెంచాయి పెట్రోలియం కంపెనీలు. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 111. 18 పైసలకు చేరుకుంది. డీజిల్ 104. 32 పైసలకు చేరుకుంది. మొత్తంగా చూస్తే అక్టోబర్లో పెట్రో వాత మామూలుగా లేదు. కొంచెం కొంచెంగా పెంచుతూ భారీగానే వడ్డించేసారు. ఈ నెలలో 22 రోజుల్లో 17 రోజులపాటు ఇంధన ధరలు పెంచేశారు. ఈ నెలలోనే లీటర్ పెట్రోల్ ధర ఐదు రూపాయలకు పైనే పెరిగింది. డీజిల్ కూడా కాస్త అటు ఇటుగా అంతే పెరిగింది. నిజానికి దీపావళి లోపు పెట్రోల్ ధరలు కాస్త తగ్గుతాయని అందరూ భావించారు  కానీ తగ్గే సూచనలే కనిపించడం లేదు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో పెట్రోలియం కంపెనీలు ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారుడిపైకి నెట్టేస్తున్నాయి. గతంలో రాష్ట్రాల ఎన్నికల సమయంలో రేట్లు పెంచిన కంపెనీలు ఆ భారాన్ని ఇప్పుడు వడ్డీతో సహా జనం నుంచి వసూలు చేసుకుంటున్నాయి. ఆగస్టు నెల కంటే  9 నుంచి 10 డాలర్ల వరకు ఈ రెండు మూడు నెలల్లో పెరగడంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటాయి. 11 రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటింది డీజిల్ ధర. అనేక మెట్రో నగరాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 120 రూపాయల వరకు కూడా పెరిగింది. ఇంకా ధరలు తగ్గేదేలే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ధరలు తగ్గించేందుకు పాలక ప్రభుత్వం ప్రయత్నించిన ధరలు తగ్గే పరిస్థితి మాత్రం ఇప్పట్లో కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: