హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్... ఆట తక్కువ... వివాదం ఎక్కువ... ఈ క్యాప్షన్ సరిగ్గా సరిపోతుంది. అధ్యక్ష ఎన్నిక మొదలు... నిధుల దుర్వినియోగం... ఒకరిపై ఒకరి ఆరోపణలు... అధ్యక్షుని రద్దు... అంబుడ్స్ మెన్... ఇలా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈ మొత్తం వివాదంపై ప్రస్తుతం దేశ అత్యునత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసోసియేషన్‌కు అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమించడంలో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ నియామకం విషయంలో జరిగిన రాద్ధాంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అవసరమైతే హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సూచించింది. అసలు ఓ క్రీడలో రాజకీయాల జోక్యం ఏమిటని... క్రికెట్‌లో రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ అవుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ కమిటీ ఆఫీసర్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సిటీ సివిల్ కోర్టు సస్పెండ్ చేసింది. ఈ తీర్పును తప్పబడుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం పక్కన పెట్టింది.

హైకోర్టు విధానాన్ని తప్పుబడుతూ.... సుప్రీంకోర్టును హెచ్‌సీఏ, బడ్జింగ్ స్టార్ క్రికెట్ క్లబ్ ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్‌లో ప్రస్తుతం ఆటకు బదులుగా రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. అసలు అసోసియేషన్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించిన ధర్మాసనం.... మొత్తం వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్ నుంచి రెండు గ్రూపులు బయటకు వెళ్లిపోవాలని ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థను కూడా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని.... ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. ఈ లోపు విచారణ కోసం మాజీ న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

HCA