కొవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు డబ్ల్యూహెచ్ ఓ మరింత సమయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ అనుమతులకు మరో రెండు వారాల సమయమం పట్టే అవకాశమున్నట్టు సమాచారం. అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని డబ్ల్యూహెచ్ అధికారులు చెబుతున్నారు. తమ నిపుణులు కోరుతున్న సమాచారాన్ని భారత్ బయోటెక్ ఎప్పటికప్పుడు అందిస్తోందని.. దానిని విశ్లేషిస్తూ అవసరమైన వివరాలు కోరుతున్నామని చెప్పారు.

అంతేకాదు ఇండియా 100కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన సందర్భంగా సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ఇది కీలక మైలురాయి అని.. అయితే బూస్టర్ డోసు మొదట వృద్ధులు, వైరస్ ప్రమాదం ఎక్కువ పొంచి ఉన్నవారికేనని చెప్పారు. ఇది వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అయితే మానవతా దృక్పథంతో ముందు ఆఫ్రికా దేశాలకు రెండు డోసుల వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక కరోనా వ్యాక్సిన్ 100కోట్లకు చేరిన సందర్భంగా నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ దేశ ప్రజలు, హెల్త్ కేర్ వర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ దేశంలోనూ 100కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వలేదనీ.. ఇది అరుదైన విషయమన్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన తొమ్మిది నెలల్లోనే ఈ ఘనత సాధించామని తెలిపారు. 18ఏళ్లు దాటిన వారిలో 75శాతం మందికి ఫస్ట్ డోసులు.. 30శాతం మందికి రెండు డోసులు అందాయని చెప్పారు. టీకా తీసుకోని వారు ముందుకు రావాలని సూచించారు.

మరోవైపు కరోనా చికిత్స విధుల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ వర్కర్లకు ప్రకటించిన బీమా పథకాన్ని మరో ఆరు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మరణిస్తే 50లక్షల రూపాయల బీమా అందుతోంది. ఈ సౌకర్యం అక్టోబర్ 20తో ముగియగా.. కరోనాతో పోరాటం కొనసాగుతోందని.. మరణాలు సంభవిస్తున్నాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మరో ఆరు నెలల పాటు 50లక్షల రూపాయల బీమా కొనసాగిస్తున్నట్టు తెలిపింది.  





మరింత సమాచారం తెలుసుకోండి: