నిరసన దీక్షతో చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారో ఏమో కానీ.. పార్టీలో మాత్రం ఈ దీక్ష జోష్ నింపిందని అంటున్నారు కార్యకర్తలు. కేంద్ర కార్యాలయం వేదికగా పార్టీలో అన్ని వర్గాలు ఏకమయ్యాయి. అందరూ ఒక్కచోటికి చేరారు. అలకలో ఉన్న కేశినేని నాని వంటి వారు కూడా అక్కడికి వచ్చారు. నారా లోకేష్ కి పోటీ అని భావిస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా వేదికపై కనిపించారు. ఒకరకంగా స్థానిక ఎన్నికలతో డీలాపడ్డ టీడీపీకి ఈ దీక్ష కాస్త ఊపిరిపోసింది.

నిరసన దీక్ష పేరుతో చంద్రబాబు 36గంటలసేపు మంగళగిరి కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. దెబ్బతిన్న కార్యాలయాన్నే దీక్షకు ఎంచుకోవడం ఆయన వ్యూహాత్మకంగా వేసిన తొలి అడుగు. దీంతో బాబు దీక్షతోపాటు.. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి కూడా ఈ 36గంటలసేపు అందరికీ కనిపించింది. పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిన తర్వాత జిల్లాల్లో కూడా క్యాడర్ కదిలింది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక చంద్రబాబు దీక్ష చేపట్టడంతో జిల్లా కేంద్రాలనుంచి అందరూ మంగళగగిరిబాట పట్టారు.

దొంగ దీక్ష అంటూ ప్రత్యర్థులు కొట్టిపారేసినా.. చంద్రబాబు ఈ దీక్షతో పార్టీని ఒక్కటి చేసినట్టు తెలుస్తోంది. అసంతృప్తులుగా ఉన్నవారంతా ఒక్కటయ్యారు. కేశినేని నాని వంటి వారు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. మిగతావారు కూడా జిల్లాలనుంచి తరలి వచ్చారు. ఇక అచ్చెన్నాయుడి అలకలు, రామ్మోహన్ నాయుడిపై వినిపించిన విమర్శలకు కూడా ఈ దీక్ష ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. స్థానిక ఎన్నికల ఫలితాలతో టీడీపీ బాగా నిరాశలో ఉంది. దీంతో పార్టీలో కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలకు వీలు కూడా లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో కేవలం జూమ్ మీటింగ్ లకే పరిమితమైన టైమ్ లో మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జరిగిన చంద్రబాబు దీక్షతో అందరూ ఒక్కటయ్యారు. టీడీపీలో ఈ జోరు ఎన్నికల వరకు ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: