తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాజోలులో వైసీపీకి కో ఆర్డినేటర్ కావాలంటూ పార్టీ సీనియర్లు తాడేపల్లికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అసలు ఇప్పటికిప్పుడు వైసీపీకి కో ఆర్డినేటర్ కావాలని వైసీపీ నేతలు ఎందుకు అడిగారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక్కడ గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైసీపీకి జై కొట్టారు. అధికారికంగా కాకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలాగానే వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజోలులో చిక్కులు తెచ్చిపెడుతోంది. రాపాక వర్గానికి, వైసీపీలో ఎప్పటినుంచో పనిచేస్తున్న మరొక రెండు వర్గాలకు ప్రస్తుతం తారా స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోంది.

రాజోలులో వైసీపీ కో ఆర్డినేటర్ గా ప్రస్తుతానికి పెద్దపాటి అమ్మాజీ వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాపాకకు పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుండటంతో, అమ్మాజీ అలకబూనారనే టాక్ వినిపిస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటోందని.. ఇక్కడి వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు రాపాకకు పోటీగా వైసీపీ తరపున పోటీ చేసి.. ఓడిపోయిన రాజేశ్వరరావు కూడా మరో వర్గంగా తయారయ్యారట.. దీంతో రాజోలులో పార్టీ మూడు ముక్కలుగా పనిచేస్తోందని అంటున్నారు. జనసేన నుంచి గెలిచాక, రాపాక వైసీపీలోకి రావడంతో ఈ వర్గపోరు మరింత తారాస్థాయిలో కొనసాగుతోంది.

రాజోలులో వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదని స్థానిక నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి కో ఆర్డినేటర్ కావాలంటూ తాడేపల్లికి సమాచారం ఇచ్చారట వైసీపీ సీనియర్ నేతలు.. రాపాక సొంత వర్గాన్ని చూసుకుంటున్నారని.. అమ్మాజీ అలకలో ఉన్నారని.. అందుకే కో ఆర్డినేటర్ కావాలని అడుగుతున్నారట.. ఇప్పటికైనా పార్టీ జోక్యం చేసుకోవాలని.. రాజోలులో పరిస్థితులను చక్క దిద్దాలని తాడేపల్లి పెద్దలను కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మూడు వర్గాల మధ్య సమన్వయం చేస్తుందా..లేక ఎప్పటిలాగే సాగదీస్తుందా.. పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలో కూడా ఇదే విషయంపై తీవ్రంగా చర్చ నడిచినా చివరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాలంలో రాపాక పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నా కార్యకర్తలు ఆయన వెంట నడవడంలేదు. దీంతో మరోసారి రాపాక వైసీపీలో కలకలం రేపినట్టవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: