తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉపఎన్నిక రోజురోజుకు మ‌రింత వేడెక్కుతున్న‌ది. ప్ర‌ధానంగా మూడు పార్టీలు కూడ ప్ర‌చారాన్ని పోటా పోటీ నిర్వ‌హిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం త‌రుచూ జ‌రుగుతూనే ఉంది. ఇరువ‌ర్గాలు కేంద్రం, రాష్ట్రం అంటూ అక్క‌డ‌క్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు కూడ ప‌డుతున్నాయి. తాజాగా ఈ ఎన్నిక‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు అయ్యాయ‌ని ఆరోపించారు. ఇటీవ‌ల హుజూరాబాద్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ర‌హ‌స్యంగా భేటి అయ్యారని పేర్కొన్నారు. గోల్కొండ కోట వ‌ద్ద వీరిద్ద‌రు ర‌హ‌స్యంగా మంత‌నాలు కూడ జ‌రిపార‌ని,  ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద‌ ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. కేటీఆర్టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ వ్యాఖ్య‌లు మాట్లాడారు.  ఈట‌ల కేవ‌లం బీజేపీ అభ్య‌ర్థి కాదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి అని తెలిపారు. టీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీల‌తో పోటీ ప‌డుతోంద‌ని..  ఈ పార్టీలు చీక‌టి ఒప్పందం కుదుర్చుకున్నాయ‌ని వివ‌రించారు. హుజూరాబాద్‌లో ఈట‌ల గెలుపు ముఖ్యం కాదు.. టీఆర్ఎస్ ను ఓడించ‌డ‌మే వారి ల‌క్ష్యం అని, త్వ‌ర‌లోనే రాజేంద‌ర్ కాంగ్రెస్‌లో చేరుతార‌నే ఒప్పందం కూడ కుదిరింద‌ని, గోల్కొండ రిసార్ట్‌లో వీరు ర‌హ‌స్యంగా క‌లిసిన ఫోటోలు,  ఆధారాలు ఉన్నాయ‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

మ‌రోవైపు ఈట‌ల రాజేంద‌ర్ భూ క‌బ్జా వ్య‌వ‌హారంపై కూడ మంత్రి స్పందించారు. ఈట‌ల ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే ముఖ్య‌మంత్రిని క‌లిసి వివ‌ర‌ణ ఇవ్వాల్సింది అని పేర్కొన్నారు. అదేవిధంగా క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ లోక్‌స‌భ ఎన్నిక‌ల మాదిరిగానే కాంగ్రెస్‌, బీజేపీ ఓట్లు బ‌దిలీ చేసుకుంటాయ‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. అందుకే రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌డం లేద‌ని చెప్పారు. మాణిక్యం ఠాగూర్ డ‌బ్బుల‌కు అమ్ముడు పోయారు.  మాణిక్యం ఠాగూర్ రూ.50 కోట్ల‌కు పీసీసీ ప‌ద‌వీని అమ్ముకున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించార‌ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌.  గురివింద గింజ త‌న న‌లుపు ఎరుగెద‌న్న‌ట్టు వారు ఇత‌రుల గురించి మాట్లాడే ముందు వారి ర‌హ‌స్య ఒప్పందాల గురించి ఎందుకు మాట్లాడ‌డం లేదు. జ‌గిత్యాలలో జీవ‌న్‌రెడ్డికి శాస‌న స‌భ‌లో 70వేల ఓట్లు వ‌చ్చాయి. కానీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 7వేల ఓట్లు ఎలా వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు.  నిజామాబాద్‌లో మ‌ధుయాష్కి గ్రాఫ్ ప‌డిపోవ‌డానికి కార‌ణం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేసుకున్న కుమ్మ‌క్కు ఒప్పందమే అని చెప్పారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి బీజేపీని గెలిపించాల‌ని ఉత్త‌రాలు రాస్తున్నాడు. నేడు గాంధీ భ‌వ‌న్‌లో గాడ్సెలు చేరారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్య‌క్తుల‌కు కాంగ్రెస్‌లో అగ్ర‌తాంబులం అని పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రింద‌ర్‌సింగ్ చెప్పార‌ని వెల్ల‌డించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: