టీడీపీ కంచుకోట ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచే ఏపీ మార్పు మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన ఓ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధి గెలిచిన మ‌రుస‌టి రోజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని భావించి.. క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ తీరును ఎండ‌గ‌డుతూ భారీ ర్యాలీతో వ‌చ్చి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు అదే సీన్ ప‌శ్చిమ‌గోదావ‌రిలోనూ రిపీట్ అయ్యింది. ఏపీలో మార్పున‌కు ప్ర‌కాశం జిల్లా రివ‌ర్స్ జంపింగ్ శ్రీకారం చుడితే అది ఇప్పుడు ప‌శ్చిమ‌లోనూ జ‌ర‌గ‌డంతో వైసీపీ సొంత పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధుల్లోనే ఎలాంటి వ్య‌తిరేక‌త ఉందో ?  సొంత పార్టీపై ఎంత వ్య‌తిరేక‌త‌తో ఉన్నారో ?  తేట తెల్ల‌మ‌వుతోంది.
జిల్లాలోని ఉంగూట‌రు నియోజ‌క‌వ‌ర్గంలోని మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీ అయిన గుండుగొల‌ను గ్రామ వైసీపీ స‌ర్పంచ్ కుర్మా ల‌క్ష్మీ రాజ‌కుమారి ఈ రోజు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్ల‌మెంటు అధ్య‌క్షుడు గ‌న్ని వీరాంజ‌నేయులు స‌మ‌క్షంలో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ యేడాది జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గుండుగొల‌ను స‌ర్పంచ్‌గా ఎన్నికైన ఆమె వైసీపీలో స్థానిక నేత‌లు త‌న‌పై పెత్త‌నం చేస్తుండ‌డంతో పాటు తీవ్ర అవ‌మానాల‌కు గురి చేస్తుండ‌డంతో కొద్ది రోజులుగా అసంతృప్తితోనే ఉన్నారు.
ఇంత జ‌రుగుతున్నా నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌క‌త్వం త‌న‌ను ప‌ట్టించు కోక‌పోవ‌డంతో ఆమె ఆవేద‌న‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వ‌చ్చి మాజీ ఎమ్మెల్యే గ‌న్ని స‌మక్షంలో టీడీపీ కండువాలు క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో త‌మ‌ను ఇష్టానుసారంగా వాడుకుని.. కుక్క‌ల‌ను చూస్తున్న‌ట్టు చూస్తున్నార‌ని.. ఎన్నో అవ‌మానాలు దిగ‌మింగుకుని ఉన్నామ‌ని.. ఈ రోజు టీడీపీతోనే దళితుల‌కు నిజ‌మైన రాజ‌కీయ, సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌నే తాము పార్టీ మారామ‌ని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు మాట్లాడుతూ ప‌శ్చిమ నుంచి మొద‌లైన ఈ మార్పు ఏపీ వ్యాప్తంగా ఓ ప్ర‌భంజ‌నంలా కొన‌సాగుతుంద‌ని అన్నారు. ఏదేమైనా అధికార పార్టీ నుంచి గెలిచిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు, సర్పంచ్‌లే త‌మ అనుచ‌రుల‌తో టీడీపీ గూటికి చేరిపోతుండ‌డంతో ఆ పార్టీలో ఉన్న అస‌మ్మ‌తికి పెద్ద నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: