హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకు హీటెక్కిపోతుంది. మీరిద్ద‌రు ఒక జ‌ట్టు అంటే.. మీరిద్ద‌రు దొంగ‌లు కాదా అంటూ దుమ్మెత్తుకుపోసుకుంటున్నారు. ఇక ఒక‌రు ఎన్నిక త‌రువాత అధికార పార్టీలో ఒక‌రికి ఉద్వాస‌న అంటే.. మ‌రొక‌రు దూరంగా ఉన్నా వాళ్లిద్ద‌రూ దొంగ‌లే అంటున్నారు. మంత్రి కేటీఆర్ చెబుతున్న ర‌హ‌స్య భేటీలు, సమావేశాల సంగ‌తులేంటో ప‌రిశీలించాల్సిందే. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ భావి సీఎంగా అంద‌రి నోట ఉన్నాడు.


 హుజురాబాద్ ఎన్నిక సంద‌ర్భంగా స‌డెన్‌గా సీన్‌లోకి వ‌చ్చాడు. త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు తెర‌ముందుకు వ‌చ్చి ఒక ర‌హ‌స్య భేటీకి సంబంధించిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్, రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ తోడు దొంగ‌లు గోల్కొండ హోట‌ల్‌లో వీళ్లిద్ద‌రూ క‌లిసి ఓ ర‌హ‌స్య భేటిలో పాల్గొన్నార‌ని అంటున్నారు కేటీఆర్‌. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్, బీజేపీ రెండు కంక‌ణం క‌ట్టుకున్నాయని ఇలా చేస్తే ఈట‌ల‌కు, కాంగ్రెస్ పార్టీకి క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని తేల్చిచెప్పారు.


అంటే బంప‌ర్ మెజారిటీ మాదేన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. వాళ్లిద్ద‌రు క‌లిసిన‌ట్టుగా నా ద‌గ్గ‌ర ప‌క్కా ఆధారాలున్నాయంటున్నారు కేటీఆర్‌. అయితే, ఈట‌ల రాజేంద‌ర్, రేవంత్ రెడ్డి ఇద్ద‌రికీ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌, ష‌ర్మిల కూడా తోడ‌య్యారని ఇలా అంద‌రూ క‌లిసి ప‌న్నాగం ప‌న్ని త‌మ‌ను ఓడ‌గొట్టెందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఈట‌ల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండానే బీఎస్పీ, వైఎస్సార్టీపీ నుంచి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింప‌లేద‌ని ఆరోపించారు కేటీఆర్‌.  


ఈ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ కూడా స‌రైన అభ్య‌ర్థిని పెట్ట‌లేద‌న్నారు. అంతేకాదు, ఈట‌ల బీజేపీ అభ్య‌ర్థి కాద‌ని కాంగ్రెస్-బీజేపీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక చీక‌టి ఒప్పందంతో ఈ రెండు పార్టీలు ప‌ని చేస్తున్నాయ‌న్నారు. అయితే, ఈట‌ల రాజేంద‌ర్‌, రేవంత్ రెడ్డి ఇద్ద‌రు క‌లిసి అంద‌రూ చూస్తుండ‌గా గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్లి క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏం ఉంద‌ని  ఆ పార్టీ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: