ఏపీ రాజకీయం మెల్లగా ఢిల్లీకి పాకుతోంది. ఇంతకాలం ఏపీలోనే సవాళ్ళూ, ప్రతి సవాళ్ళూ చేసుకున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఇపుడు తన వేదికను హస్తినకు మార్చేశాయి. దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు ఆ వైపుగా సాగడమే.

చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. చాలా కాలానికి ఆయన దేశ రాజధానిలో అడుగులు పెట్టనున్నారు. ఆయన ఏపీలో గత రెండున్నరేళ్ళుగా సాగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ  పంచాయతీని కేంద్ర పెద్దల ముందు పెట్టి వైసీపీని బదనాం చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతితో పాటు, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. ఆయనకు కనుక మోడీ షా అపాయింట్మెంట్స్ లభిస్తే అది టీడీపీ విజయంగానే చూడాలి అంటున్నారు. ఏపీలో వైసీపీని కార్నర్ చేయడానికి దాన్ని ఎలా వాడుకోవాలో కూడా టీడీపీకి తెలుసు అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకూడదు అనుకుంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించినా కూడా మోడీ, షాలతో చంద్రబాబు భేటీ కాకుండా చూడాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రం వద్ద ఉన్న తమ పలుకుబడిని ఉపయోగించాలని చూస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి  ఈ వేళ వైసీపీ మద్దతు అన్ని విధాలుగా కీలకం అంటున్నారు. రాజ్యసభలో ఇప్పటికే బలం తగ్గిన బీజేపీకి వైసీపీ సపోర్ట్ కావాలి. అదే విధంగా వచ్చే ఏడాది జరగనున్న రాష్టపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ నంబర్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల కేంద్రం టీడీపీని ఈ సమయంలో చేరదీస్తుందా అన్న చర్చ అయితే ఉంది. అలా జరగకుండా చేస్తే మాత్రం వైసీపీ పట్టు నిరూపించుకున్నట్లే. మరి కేంద్రం వద్ద ఏ పార్టీకి మొగ్గు ఉంది. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేసే అడుగులు ఎలా ఉంటాయి అన్నది కొద్ది రోజులలో హస్తినలో జరిగే పరిణామాల బట్టి తేలే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp