టీవీ సీరియల్స్. ఇవి చూడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరూ సీరియళ్లను చూస్తూనే ఉంటారు. అంతలా సీరియళ్లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. అయితే ఇటీవల సీరియళ్ల జోరు పెరిగింది. ఇటీవల సీరియళ్లు తమ స్వరూపాన్ని కూడా మార్చుకున్నాయి. ఏకంగా సినిమాలతో పోటీపడుతూ.. భారీగా వాటి నిర్మాణంకోసం ఖర్చు పెడుతున్నాయి సంస్థలు. సీరియళ్ల బ్రేక్ సమయంలో వచ్చే యాడ్ రెవెన్యూ ఆదాయం కారణంగా ఖర్చుకు ఎవరూ ఆలోచించడం లేదు. ఆ స్థాయిలోనే వాటికి అదనపు హంగులు జోడిస్తున్నారు. పోటీ పెరిగిపోవడంతో అందరూ క్వాలిటీ పెంచడంతోపాటు, వెరైటీగా ట్రైచేస్తున్నారు.

దీనికి తోడు ప్రస్తుతం సీరియళ్ళలో కొత్త ట్రెండ్ మొదలైంది. గత రోజుల్లో వచ్చే సీరియల్స్ లో..  నటీనటులు ఒకరికొకరు అంటీముట్టనట్టుగా ఉండేవారు.. అయితే కాలక్రమేణా సీరియళ్లలో కూడా రొమాంటిక్ సీన్లు ఎక్కువైపోయాయి. సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా రొమాంటిక్ సీన్లు తీసేస్తున్నారు. రొమాంటిక్ సీన్లే కాదు.. ఏకంగా శోభనం సీన్లు, లిప్ లాక్ సీన్లతో పాటూ.. పాటలు కూడా చిత్రీకరించి.. జనంపై వదిలేస్తున్నారు. కనీసం వారం రోజుల్లో మూడు రోజుల పాటూ ఈ రొమాంటిక్ సీన్లు వస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క మనదేశంలోనే కాదు.. అనేక దేశాల్లో టీవీ సీరియల్స్ లో ఇప్పుడు ఈ రొమాంటిక్ సీన్లే ట్రెండ్ అవుతున్నాయి.

అయితే సీరియల్స్ లో వచ్చే ఈ రొమాంటిక్ సీన్లకు పాకిస్తాన్ ప్రభుత్వం కత్తెర వేయనుంది. వీటిపై కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. ఇక నుంచి సీరియల్స్ లో కౌగిలింతలు, ముద్దు సీన్లు ఉండొద్దని ఆదేశించింది. ఇలాంటి దృశ్యాలను ప్రసారం చేయొద్దంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీని ఆదేశించింది. పౌరుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్ సమాజాన్ని ప్రతిబింబించేలా సీరియల్స్ ఉండటం లేదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. సినిమాల్లో ఇలాంటి సీన్లకు సెన్సార్ కత్తెర ఉన్నా, బుల్లితెరపై దానికి పెద్దగా పదును లేదు. దీంతో చాలామంది రేటింగ్స్ కోసం మసాలా దట్టించి సీరియళ్లు తీసేసి జనంమీదకు వదిలేస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి కఠినమైన ఆంక్షలు వస్తాయో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: