హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఒక స్వతంత్ర అభ్యర్థికి ప్రయోజనం కలిగేలా అధికార టీఆర్ఎస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారట. వినడానికి ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది కదూ. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలంటే.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్న విషయం గురించి తెలుసుకోవాలి. కారును పోలిన గుర్తులు ఎక్కడ తమ కొంప ముంచుతాయో అనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమికి కారణమైన గుర్తులే.. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ కేటాయించడంతో కారు పార్టీలో కంగారు రేకెత్తింది. నిజానికి ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు  ఎంత ముఖ్యమో..  వారి పార్టీ బలం, బలగం, గుర్తు కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రజల్లో రిజిష్టర్ అయిన గుర్తుల మీద పోటీ చేయడానికి నేతలు మొగ్గు చూపుతుంటారు. స్వతంత్రులు అయితే ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తుల కోసం ఈసీని కోరుతుంటారు. రిజిష్టర్డ్ పార్టీలను పోలిన గుర్తులతో వారి  ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పార్టీల గెలుపోటముల మీద.. స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు  ప్రభావం చూపుతున్నాయి. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో  కూడా అలాంటి గుర్తులే అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారాయన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ పార్టీ గెలుపు కోసం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు కొందరు నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో మొత్తం 30 మంది ఉన్నారు. ఇందులో వివిధ పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు.

మంత్రి హరీశ్‌రావు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించడమే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పరిధిలో ఉండే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మండిపడుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రతిచోట ప్రచారంలో భాగంగా గ్యాస్ సిలిండర్‌ను ముందుంచుతున్నారు. దీనిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్‌కు ఎన్నికల సంఘం గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ''హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ తరపున ప్రచారం చేస్తున్న హరీశ్‌ రావు...!'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: