తిరుపతి ఎంపీ గురుమూర్తి నేరుగా జనాల్లోకి రావడం అరుదు. ఎన్నికలకు ముందయినా, ఎన్నికల తర్వాత అయినా ఆయన ఏదో ఒక లోకల్ లీడర్ పిలిస్తేనే జనాల్లోకి వచ్చేవారు. వారితో కలసే పర్యటించేవారు. కానీ ఇప్పుడిప్పుడే గురుమూర్తి సోలో ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నారు. తన సొంత ట్విట్టర్ అకౌంట్ మెయింటెన్ చేస్తూ ఎప్పటికప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికకు సీఎం జగన్ అభ్యర్థిని ప్రకటించిన సమయంలో అసలు గురుమూర్తి ఎవరు, ఏంచేస్తారు, జగన్ ఎందుకు ఆయన పేరు ప్రకటించారు, దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ కొడుకు కల్యాణ్ చక్రవర్తి పోటీకి ఉత్సాహంగా ఉన్నా కూడా గురుమూర్తిని ఎందుకు తెరపైకి  తెచ్చారనే చర్చ తీవ్రంగా జరిగింది. ప్రతిపక్షాలు గురుమూర్తిపై విమర్శలు కూడా ఎక్కుపెట్టాయి. కానీ పట్టుబట్టి వైద్యుడు గురుమూర్తిని రాజకీయాల్లోకి తెచ్చి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు జగన్.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అంత హుషారుగా ప్రచారం చేయడానికి, గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించడానికి కారణం గురుమూర్తి రాజకీయాలకు కొత్త కావడమే. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా ఆయన గెలుపుకి తీవ్రంగా కృషిచేశారు. ఒకరకంగా ఆయన్ను జనాల్లోకి తీసుకొచ్చి, నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టి, వైసీపీలోని ప్రతి కార్యకర్తకూ ఆయన్ను పరిచయం చేసి ముందుకు నడిపించారు. దాదాపు ఎన్నికల తర్వాత కూడా ఎంపీ గురుమూర్తి సోలోగా జనాల్లోకి రాలేదు. ఎమ్మెల్యేలతోపాటే.. ఆయన పార్టీ కార్యకలాపాలలో, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన తనకంటూ సొంత గుర్తింపు కోరుకుంటున్నారు. నేరుగా జనాల్లోకి వస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరామర్శలతో కార్యకర్తలకు తానున్నాననే  భరోసా కల్పిస్తున్నారు.

 

జనాగ్రహ దీక్షలో కూడా గురుమూర్తి వైరిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా, తనకు ఓటు వేయాలని ప్రజల్ని అడిగారే కానీ, ఎక్కడా ప్రతిపక్షాలపై విమర్శలు చేయలేదు గురుమూర్తి. మెల్లి మెల్లిగా ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా మారుతున్నారాయన. స్వరం పెంచారు, సోలోగా ముందుకెళ్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: