ఒకప్పుడు నక్సలిజం, అన్నలు అంటే అదేదో ఆయా ప్రాంతాలను ఉద్ధరించే వారి సైన్యం అని గౌరవం ఉండేది. కానీ రానురాను దానిలో కూడా స్వార్థం తప్ప మరొకటి కనిపించడం లేదు. వాళ్ళు ఉన్న ప్రాంతాలలో గిరిజన ప్రజలు అనేకానేక అధికారుల నుండి ఇబ్బందులు పడి వాళ్ళను కాపాడుతుంటే, వాళ్ళు మాత్రం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకుండా ఆయా ప్రాంతాలను కుళ్లబెడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇలా చేస్తుంటే వాళ్ళు ప్రశించడానికి అంటూ అడవులలోకి వెళ్లారు. కానీ నేడు వాళ్ళే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కంటకులుగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఆయుధాలు, ఆదాయం కావాలి. అది కావాలంటే గంజాయి వంటివి సాగు చేయించాలి, తద్వారా వచ్చిన సొమ్ముతో తీవ్రవాద సంస్థల నుండి ఆయుధాలు కొనుగోలు చేసుకోవాలి. ఆయా మాదకద్రవ్యాలు కూడా ఉగ్ర సంస్థలకే అమ్ముతారు.

ఇలా ఒక గౌరవమైన ఉద్యమ చరిత్ర నేడు చెదలుపెట్టిపోతుంది. ఎప్పుడు చూసినా ప్రజల ప్రయోజనాల కోసమే అనేవాళ్ళు నేడు అధికారులపై ప్రతీకారాలు తీర్చుకోవడానికి తప్ప మరోపని లేదన్నట్టే ప్రవర్తిస్తున్నారు. అలాగే దానికోసం ఎంతకైనా దిగజారుతున్నారు. వీళ్లు మాదకద్రవ్యాల సాగు చేస్తారు, వాటిని ఉగ్రసంస్థలకు అమ్ముకుంటారు, వాళ్లకు కావాల్సినవి అందుతాయి అంతవరకు బాగానే ఉంది. ఆ మాదకద్రవ్యాలు మళ్ళీ ఎక్కడకు వస్తాయి, దేశంలోకే వచ్చి యువతను, రేపటి పౌరులను నిర్వీర్యం చేస్తాయి. ఈ మాత్రం ఆలోచించని వారు ఉద్యమకారులు ఎలా అవుతారు, వీళ్లు ఖచ్చితంగా స్వార్థపరులు మాత్రమే. ఇంకా చాలా సార్లు ఎవరైనా పోతే ఉద్యమం కోసం త్యాగం చేసిండు అనుకోమంటూ సినెమ డైలాగ్ చెపుతుంటారు, మీరే ఛస్తే బాగుండు అంటుకుంటున్నారు, మీరు కాపాడతానని అన్నవాళ్ళే. అది అన్నల పరిస్థితి నేడు.

అసలు నిజమైన అన్నలైతే దేశానికి మాదకద్రవ్యాల ప్రమాదం ఉంటుందని తెలిసి, దానిని సాగుచేయకుండా అడ్డుకోవాలి. అసలు సాగు అవుతున్నదే అడవులలో, అన్నలకు తెలియకుండానే అడవులలో ఈ సాగు జరుగుతుందా..! పోనీ తెలియక జరుగుతుందని ఒక క్షణం అనుకున్నప్పటికీ, తెలిసిన తరువాత దానిని కాల్చేయాలి కదా. అంతేకాని అమ్ముకునే దాకా ఎందుకు వస్తున్నారు. ఇలా స్వార్థప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని బ్రతికేస్తున్నారు అంతే. నిజంగా అన్నలైతే అలాంటివి పండించేవారికి సర్ది చెప్పి వేరే దారి చూపిస్తారు, వాటికోసం వచ్చిన ఉగ్రమూకలను హతమారుస్తారు. అలాంటి వారు ఎక్కడో ఒక్కరు ఉంటారేమో, అతను ఒక్కడు ఏమి చేయలేక ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: