`` టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక ఎత్తు.. రాబోయేరోజుల్లో చూడ‌బోయేది మ‌రో ఎత్తు`` అంటున్నారు వైసీపీ నాయ‌కులు. నిజానికి ఇప్ప‌టి వ‌రకు రెండున్న‌రేళ్ల పాల‌న‌లోనే టీడీపీని క‌కావిక‌లం చేసేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్ర‌భుత్వానికి మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. సో.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తేన‌ని.. తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయ‌న సూటిగా చెప్పినా చెప్ప‌క‌పోయినా.. దీనివెనుక చాలా మీనింగ్ ఉంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

అంటే.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లో టీడీపీని మ‌రింత ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తుంద‌నే సంకేతాల‌ను ఆయ‌న ఇచ్చారు. దీనిలో ప్ర‌ధానంగా ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి అండ‌గా ఉన్న‌క‌మ్మ వ‌ర్గాన్ని దూరం చేయాల‌నేది వైసీపీవ్యూహంగా ఉంద‌ని అంటున్నా రు. దీనికి దివంగ‌త ఎన్టీఆర్‌నే సాధ‌నం చేసుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణి.. తెలుగు అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్ ల‌క్ష్మీపార్వ‌తి వెల్ల‌డించారు.

గ‌తంలో చంద్ర‌బాబు టీడీపీని హ‌స్త‌గ‌తం చేసుకున్న స‌మ‌యంలో ఎన్టీఆర్ కొన్ని టీవీ చాన‌ళ్ల‌కు జామాత ద‌శ‌మ‌గ్ర‌హం పేరుతో ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ రికార్డుల‌ను రాబోయే రోజుల్లో ప్ర‌తి ఇంటికి ఇచ్చి.. చంద్ర‌బాబు విష‌యంలో అన్న‌గారు ఎలాంటి ఆలోచ‌న‌తో ఉన్నారో.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు అన్నగారిని ఎన్ని రూపాల్లో ఇబ్బందులు పెట్టారో.. వివ‌రిస్తామ‌ని ఆమె చెప్పారు. నిజానికి ఇప్ప‌టికీ.. యూట్యూబ్‌ల‌లో అన్న‌గారి గ‌త ప్ర‌సంగం ఉంది. కానీ, ఎక్కువ మందికి ఇది చేర‌లేదు. కానీ, ఇప్పుడు వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌తి ఒక్క‌రికీ ఇది చేరేలా ప్లాన్ చేస్తోంది.

ఇదే జ‌రిగితే.. చంద్ర‌బాబుకు భారీ మైన‌స్ ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రోవైపు గ‌తంలో చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. బీజేపీతో వ్య‌వ‌హ‌రించిన తీరు.. క‌మ్యూనిస్టుల‌ను ఎలా వాడుకున్నారు..?  వంటి విష‌యాల‌ను కూడా వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు. ఇవేవీ కొత్త‌వి కాక‌పోయినా.. వీటికి కొత్త హంగులు అద్ది.. చంద్ర‌బాబు నైజాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. ఆయ‌న‌ను మ‌రింత చుల‌కన చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

నిజానికి ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. చంద్ర‌బాబు ఇమేజ్ తోనే ఇప్ప‌టికీ.. టీడీపీ అడుగులు వేస్తోంది. అయితే.. ఇప్పుడు అదే చంద్ర‌బాబును గురి చూసి కొట్ట‌డం ద్వారా.. టీడీపీని మ‌రింత ప‌లుచ‌న చేయ‌డం ద్వారా.. పార్టీ ఉనికికే ప్ర‌మాదం పొంచి ఉండేలా చూడాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో ఆర్థిక మూలాలున్న పార్టీ నేత‌ల‌ను కూడా దెబ్బ‌తీయ‌డమో.. లేక త‌మ‌వైపు తిప్పుకోవ‌డ‌మో చేయాల‌ని వైసీపీ నాయ‌కులు ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇది కూడా చంద్ర‌బాబుకు పెను స‌వాలే. పార్టీలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉన్న నాయ‌కులు క‌నుక వెళ్లిపోయినా.. మౌనంగా ఉన్నా.. ఆయ‌న పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డం క‌ష్టం. మ‌రి ఇలాంటి ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: