హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం ముగింపునకు గడువు సమీపిస్తుండటంతో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీలో మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఇటు అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌లు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు.ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు, ఎత్తుగడలు మారుస్తూ ముందుకు సాగుతున్నాయి. విమర్శలకు పదును పెడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

హుజురాబాద్‌ ఉపఎన్నికకు ప్రధాన కారణంగా ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడం. ఆరు నెలల క్రితం వరకు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చలామణి అయిన ఈటల రాజేందర్.. ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశాక కేసీఆర్‌పై తరుచూ విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్‌లో ఆరు సార్లు టీఆర్ఎస్‌ జెండా ఎగురవేయడంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య నేతగా ఉన్న తనను కేసీఆర్‌ గెంటివేశారనీ, ఆయనకు బుద్ది చెప్పేందుకు ప్రజలు తన గెలుపునకు సహకరించాలని ఈటల రాజేందర్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.

హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్‌.. తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది అభివృద్ధి మంత్రాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం సాగిస్తోంది. ఇప్పటికే దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకు దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని పెండింగ్ పనులకు భారీగా నిధులు విడుదల చేశారు. పలు అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో సహా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు, నేతలు సుమారు ఐదు నెలల నుంచి హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు.

టీఆర్ఎస్‌, బీజేపీలు అభివృద్ధి, సానుభూతి అని ప్రచారం సాగిస్తుండగా.. ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోంది. తమ పార్టీ తరఫున విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపిన కాంగ్రెస్.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, వాటిని ఓడించాలనిప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఒకసారి హుజురాబాద్‌లో ప్రచారం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో దానిపై మరింతగా దృష్టి సారించారు. మొత్తంమీద హుజురాబాద్‌ ఉపఎన్నికలో రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొత్తంమీద హుజురాబాద్‌లో ఉపఎన్నికలో అభివృద్ధి వర్సెస్‌ సానుభూతి అన్నట్లుగా పోటీ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: