ఏడేళ్ళ క్రితం తెలంగాణా లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే ఉంది. ఆంధ్ర, తెలంగాణా రెండూ కలసి ఒకటిగా నిండుగా బతికాయి. ఇపుడు తెలంగాణా వేరు పడిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజన గాయాలతో అసలైన కొత్త రాష్ట్రంగా దేశం ముందు నిలబడింది. ఆ అంటే అన్న పూర్ణ అని రాష్ట్రానికి ఒక నాటి పేరు. ఇపుడు మాత్రం అప్పుల ఆంధ్రా అంటున్నారు.

ఈ మధ్యనే మాజీ ఎంపీ, మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఆరు లక్షల కోట్ల అప్పులు ఏపీకి ఉన్నాయి. వాటి మీద ఏటా యాభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. సరే ఇది ఇలా ఉంటే మరో రెండున్నరేళ్ల పాలన జగన్ కి ఉంది. మరి దానికి కూడా ఖర్చు కలుపుకుంటే కచ్చితంగా పది లక్షల కోట్లు అప్పులు అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ నేపధ్యంలో ఏపీ పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది. అటు టీడీపీ అయిదేళ్ల పాలనను జనాలు చూశారు. మరో వైపు జగన్ రెండున్నరేళ్ళ పాలన కూడా చూశారు.

ఏ ప్రభుత్వం అయినా ఏముంది గర్వకారణం అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఏపీలో అభివృద్ధి కనిపించడంలేదు. ఈ రోజుకీ సరైన రాజధాని లేదు. ఇక పారిశ్రామికంగా ఏపీ అడుగులు వేయడంలేదు. ఏ విధంగా చూసినా ఖర్చు తప్ప రాబడి అందని రాష్ట్రంగా ఉంది. ఇవి ఒక వైపు సమస్యలుగా ఉంటే రాజకీయ నాయకత్వం  కూడా దారుణంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయం కానీ విభజన హామీలు కానీ కేంద్రాన్ని ఐక్యంగా అడిగి సాధించుకుందామన్న ధ్యాస కానీ ఆశ కానీ లేకుండా పోయాయి. విభజన తరువాత ఏపీకి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటిని అడగడంలేదు.

సరిగ్గా ఈ సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ జనాలు కూడా టీయారెస్ ని కోరుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. నిజంగా కేసీయార్ నాయకత్వం పట్ల ఆయన దక్షత పట్ల ఏపీ జనాలకు విశ్వాసం ఉంది. మరి ఆయన కనుక ఏపీలో పార్టీ పెడితే ఓటేస్తారా అంటే ఏమో చెప్పలేం, ఇది రాజకీయం, ఏమైనా జరగవచ్చు. కేసీయార్ అపుడపుడు ఏపీకి వస్తేనే ఆయన కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ ఏపీలో ఉన్నారు. సో కేసీయార్ కి ఆదరణ ఉన్నట్లే. మరి ఎంత ఉందో కేసీయార్ నిజంగా తేల్చుకుంటారా. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: