హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం చివ‌రి అంకానికి చేరుకుంది. ఐదు నెల‌లుగా టీఆర్ఎస్, బీజేపీ పంథాలు, ప‌ట్టింపుల‌కు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టే స‌మ‌యం ద‌గ్గ‌ర  పడుతోంది. విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టి అస‌లు సిస‌లు కార్య‌క్ర‌మాల‌కు తెర లేపే ప్ర‌క్రియ ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టికే ఆ రెండు పార్టీలు హుజురాబాద్ ఓట‌ర్ల‌ను అన్ని కోణాల్లో మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. క‌వ‌ర్ల‌లో డ‌బ్బులు, టోకెన్ల‌తో మ‌ద్యం పంచుతున్నాయి. ప్ర‌చార స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌టంతో అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో గుబులు రేగుతోంది. ఐదు నెల‌లుగా వివిధ మండ‌లాల‌కు ఇన్‌చార్జిలుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఈ భ‌యం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఉపఎన్నిక ఫలితం రోజు తేడా వ‌స్తే త‌మ సంగ‌తి ఏమ‌వుతుందో అన్న ఆందోళ‌న వారిలో నెల‌కొంది. వాళ్లు ఇన్‌చార్జిలుగా ఉన్న మండ‌లాల్లో త‌క్కువ ఓట్లు వ‌స్తే వారికి ఇబ్బందులు త‌ప్పేలా లేవు.  ఇన్ని నెల‌లు అక్క‌డ ఉండి ఏం చేశార‌ు? అని గులాబీ బాస్ ప్ర‌శ్నిస్తే.. ఏం స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుందో అన్న టెన్ష‌న్ వారిలో క‌నిపిస్తోంది. ఈనెల 27వ తేదీ రాత్రి ఏడు గంటల్లోపు ఇన్‌చార్జిలు అందరూ హుజురాబాద్‌ను విడిచి వెళ్లి పోవాల్సి ఉంటుంది. వారు ఇంఛార్జీలుగా ఉన్న మండ‌లాల్లో ఇక స్థానిక నేత‌ల‌దే బాధ్య‌త‌. అయితే వారు ఏ మేర‌కు చివ‌రి రెండు రోజులు ఓట‌ర్ల‌ను మేనేజ్ చేయ‌గ‌ల‌ర‌న్న భ‌యం టీఆర్ఎస్‌లో క‌నిపిస్తోంది.

మరోవైపు బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్‌లోనూ టెన్ష‌న్ క‌నిపిస్తోంది. స్థానిక అధికార పార్టీ నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం ఆయనకు ఒక టాస్క్‌గా మారింది.  రెండోది గ్రామాల్లో చివ‌రి రెండు రోజులు త‌న ఓటు బ్యాంక్‌ను ప‌దిలంగా కాపాడుకోగ‌ల‌గాలి. త‌న చుట్టూ ఉన్న లీడ‌ర్లంద‌రినీ టీఆర్ఎస్ లాగేసుకుంది. దీంతో జ‌నం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి, గ్రామాల్లో త‌న ఓటు బ్యాంకును కాపాడుకోవ‌డానికి చివ‌రి రెండు రోజులు కార్య‌ాచ‌ర‌ణ అమ‌లు చేసే నేత‌లు కూడా ఆయనకు లేకుండా పోయారు. దీంతో ఈటల మ‌రింత ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు. ఇక ఆయ‌న భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే ఈ ఉప ఎన్నిక ప్ర‌చారం మ‌రో రెండు రోజుల్లో ముగుస్తోంది. అందుకే ఆయన మరింత ఆందోళనకు గురి అవుతున్నారు.  బీజేపీ ఇన్‌చార్జిలందరూ, బ‌య‌ట నుంచి వ‌చ్చినవారు కాబట్టి వారు వెళ్లిపోతారు. దీంతో ఇక ఒక్క‌డే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్య‌త‌ను ఈటల రాజేందర్‌ యువ‌తపై పెట్టారు..

ఇక టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఉత్సాహంగా క‌నిపిస్తోంది. రేవంత్‌రెడ్డి రాక‌తో ముందు కంటే త‌మ ఓటు బ్యాంకు పెరుగుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. మంచి ఓటింగ్ సాధిస్తామ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. అయితే ఆ పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో 60 వేల ఓట్లు వ‌చ్చాయి.  అన్ని ఓట్లు మ‌ళ్లీ ఇప్పుడు సాధిస్తుందా.. లేదా.. అన్న‌దే ఆ పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ నెల‌కొంది. గౌర‌వ ప్ర‌థమైన ఓట్ల‌ను సాధిస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: