ఫోన్ ట్యాపింగ్.. ఇదో వివాదాస్పద అంశం.. ఫోన్‌ ట్యాపింగ్ అనేది రుజువైతే చాలా పెద్ద నేరం అవుతుంది.. కానీ.. ఇదేదీ రుజువయ్యే వ్యవహారం కాదు.. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎప్పుడూ సంచలనం అవుతుంటాయి. గతంలో నోటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు ఫోన్‌ను అనధికారికంగా ట్యాప్ చేసినందువల్లే కేసీఆర్‌ ఆయనతో రాజీకి రావాల్సి వచ్చిందన్న వాదన వుంది.  ఆ కథ అలా ఉంచితే మరోసారి ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణలో తెరపైకి వచ్చింది.


తెలంగాణ పోలీసులు అన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. ఇలాంటి అధికారులపై అధికారంలోకి వచ్చాక తప్పకుండా చర్య తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలపై పెద్దగా స్పందించన పోలీసులు.. ఇప్పుడు స్పందించారు. తెలంగాణ పోలీసు శాఖపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ కార్యాలయం రియాక్ట్ అయ్యింది.


ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ డీజీపీ కార్యాలయం తీవ్రంగా తప్పుబట్టింది. రేవంత్ ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలనేనట.. అలా  పేర్కొంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.  మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనేది అవాస్తవమని..  ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కూడా అవాస్తవని తెలంగాణ డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇండియన్ టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారమే పోలీసు శాఖ నడుచుకుంటోందని తెలిపింది.


పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాల మధ్య మంచి సమన్వయం ఉందన్న డీజీపీ కార్యాలయం..  ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే పోలీసు శాఖలో పోస్టింగులు ఇచ్చామన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల ఖాకీల్లో ఆత్మస్థైర్యం, మనోధైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు.. మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్‌ అనటం సరైంది కాదని... ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టులు బలితీసుకున్నారనే విషయం మరిచిపోకూడదని ఆ ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: