టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుజురాబాద్‌లో అడుగు పెట్టిన త‌ర్వాత కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల పాటు రేవంత్‌ రెడ్డి సాగించిన ఎన్నికల ప్రచారం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. తొలిరోజు వీణవంక బహిరంగ సభలో, రెండో రోజు ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో నిర్వహించిన సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొని చేసిన ప్రసంగాల్లో.. ఈటల రాజేందర్‌, హరీశ్‌రావులపై సంధించిన విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు చర్చకు దారితీశాయి. మొన్న‌టి దాకా హ‌రీశ్‌ రావు, ఈటల రాజేంద‌ర్ ఒకే కంచంలో తిన్నార‌నీ, ఆ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డి తన తొలిరోజు ప్రచారంలో భాగంగా వీణవంక సభలో చేసిన ప్రసంగంలో.. పాటి కౌశిక్‌ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి చప్పట్ల మోత వినిపించింది. స‌భ‌లో ఆయ‌న చెప్పిన అల్లుడి క‌థ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. మేన‌రిక‌పు అల్లుడు పారిపోతే.. కొత్త అల్లుడిని తెచ్చుకున్నామ‌ని, ఆ కొత్త పెళ్లి కొడుకే బ‌ల్మూరి వెంక‌ట్ అని రేవంత్ అన్నారు. అటు కౌశిక్‌ రెడ్డికి కౌంట‌ర్ ఇస్తూనే.. ఇటు బ‌ల్మూరి వెంక‌ట్‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సరికొత్త‌గా ప‌రిచ‌యం చేశారు.

వీణ వంక మండ‌ల కేంద్రం నుంచి రేవంత్ రెడ్డి భారీ కాన్వాయ్ జ‌మ్మికుంట గాంధీ చౌర‌స్తాకు చేరుకున్నాక అక్కడ ఆయన చేసిన ప్రసంగం కూడా కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్‌ నింపింది. కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ స్థానిక‌త‌పై టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న కామెంట్స్‌ కు రేవంత్ రెడ్డి జ‌మ్మికుంట స‌భ‌లో త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. బ‌ల్మూరి వెంక‌ట్ స్థానికత గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. కేటీఆర్‌ది సిరిసిల్ల‌నా, అమెరికాలో చిప్ప‌లు క‌డిగే కేటీఆర్ సిరిసిల్ల‌లో పోటీ చేయ‌లేదా?  హ‌రీష్ రావు సిద్దిపేట‌లో స్థానికుడా? అంటూ ఆయ‌న మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌లు కూడా జ‌నంలోకి బాగా వెళ్లాయి..

ఇక రెండో రోజు ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి ఇల్లందకుంట మండ‌లానికి చేరుకున్నారు. ఇల్లందకుంటలో నిర్వ‌హించిన స‌భ‌కు భారీగా జ‌నం హాజ‌ర‌య్యారు. రేవంత్ రెడ్డి ప్ర‌సంగాలు, స‌భ‌ల‌కు హాజ‌రైన జ‌నం చూసి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వ‌చ్చింది. రేవంత్ రెడ్డి రాక‌తో మంచి ఓటు బ్యాంకు సాధిస్తామ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు ఆ పార్టీ నేత‌లు. మరి రేవంత్ రెడ్డి స‌భ కాంగ్రెస్‌కు ఎలాంటి బూస్ట‌ప్ ఇచ్చిందో తెలియాలంటే న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: