నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. కాలు జారితే తీసుకోవచ్చు.. మాట జారితే తీసుకోలేం.. మాటలు కోటలు దాటతాయి.. చేతలు ఇల్లు దాటవు.. ఇలా మాటలపై తెలుగు భాషలో ఎన్నో సామెతలు ఉన్నాయి.. ఇవన్నీ మాట విలువను చెప్పకనే చెబుతాయి. ఎలా మాట్లాడాలో తెలియకపోయినా పర్వాలేదు.. కానీ.. ఎలా మాట్లాడకూడదో మాత్రం తప్పకుండా తెలిసి ఉండాలి లేకపోతే.. జరిగే నష్టం ఎంతో ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అలాంటిదే.


ఒక్కమాట.. ఒక్క సభ.. ఒక్క ప్రసంగం.. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేశాయి. ఒక్క ప్రసంగంతో ఏకంగా రూ.25 లక్షల కోట్లు ఆయన నష్టపోయాడు.. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా.. ఆయనే జాక్‌ మా.. చైనాకు చెందిన బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు ఈ జాక్‌ మా.. ఏడాది క్రితం ఆయన అనాలోచితంగా చేసిన కామెంట్లు.. ఆయన వ్యాపారాన్ని అతలాకుతలం చేశాయి. ఏకంగా రూ. 25 లక్షల కోట్లు రూపాయలు నష్టపోయే స్థితికి తెచ్చాయి.


ఇంతకీ ఏం జరిగిందంటే.. 2020 అక్టోబరు 24న చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో  ఓ మీటింగ్ జరిగింది. ఈ సదస్సుకు జాక్‌ మా హాజరయ్యారు. అయితే జాక్‌మా తన ప్రసంగంలో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ప్రస్తావించారు. చాలా రోజులుగా కోపంగా ఉన్నాడేమో.. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని మాట్లాడారు. చైనాలో  సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నాడు. చైనాలో సరైన ఆర్థిక విధానాలు లేవన్నాడు.


అసలే అక్కడ ఉన్నది చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం.. ఆ మాటలు అన్నది దేశంలోనే పేరున్న ఓ బిలియనీర్.. దీంతో ఈ ప్రసంగం సంచలనం అయ్యింది. ఇది చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. జాక్‌ మాను టార్గెట్ చేసింది. జాక్‌ మా వ్యాపార సంస్థలపై నిఘా పెట్టింది. జాక్‌ యాంట్‌ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా చైనా అడ్డుపడింది. ఈ సంకేతాలతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు తగ్గిపోతూ వచ్చాయి.  అలా ఏడాదిలో జాక్‌మా నష్టపోయింది అక్షరాలా.. పాతిక లక్షల కోట్లు.. ఇదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: