నాయ‌కుల్లో ప‌రిణితి లేన‌ప్పుడు ఎవ‌రు ఎన్ని ప్ర‌శ్నించినా ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించినా ఫ‌లితం ఉండదు. ఢిల్లీ కేంద్రంగా చ‌లి గాలులు ఆరంభం అయ్యే వేళ‌లో వేడి పుట్టించే రాజ‌కీయం ఒక‌టి ఈ అక్టోబ‌రు చివ‌రిలో చేస్తున్నాడు బాబు. వీటి ఫ‌లితం ఏంట‌న్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోతుంది. కేవ‌లం ప్రాంతీయ రాజ‌కీయ పార్టీలు సానుభూతి పేరిట కేంద్రం చుట్టూ తిర‌గ‌డ‌మే పెద్ద జోక్.

దేశ రాజ‌కీయాల‌ను ఓ సంద‌ర్భంలో తీవ్ర స్థాయిలో ప్ర‌భావితం చేసిన నేత చంద్ర‌బాబు. త‌న మాట వేదం అని చెల్లుబాటు అయ్యేలా చేశాడు. కూట‌మి రాజ‌కీయాల్లో ద‌క్షిణాది త‌ర‌ఫున కీల‌క నేత‌గా ఎదిగాడు. తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ త‌రువాత ఆయ‌న‌కు అంత‌గా పేరు రాలేదు. గుర్తింపూ రాలేదు. ఒక‌ప్పుడు బాబూ టూర్ అంటే నేష‌న‌ల్ మీడియా కూడా ఎక్కువ‌గా ఫోక‌స్ చేసేది. అప్పుడు ఏపీ సీఎం హోదాలో ఆయ‌న గంట‌ల తర‌బ‌డి ఢిల్లీ పెద్ద‌ల‌తో మాట్లాడేవారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధిపై విప‌రీతంగా ఫోక‌స్ చేస్తూ వారితో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌భుత్వం న‌డుపుతున్న ప్రేరేపిత ఉగ్ర‌వాదం ఏం చేస్తుందో చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశాడు. అదేవిధంగా మీడియా ముందు  ఏం చెప్పాడో అదే రాష్ట్ర‌ప‌తికీ చెప్పాడు చంద్ర‌బాబు. అంత‌కుమించి ఆయ‌న చెప్పిందీ లేదు. సాధించిందీ లేదు. ఢిల్లీలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబుకు ఆశించిన స్థాయిలో లేదా అనూహ్య స్థాయిలో వ‌స్తుంద‌నుకున్న మ‌ద్ద‌తు రావ‌డం క‌ష్ట‌మే!

ఇక మోడీ త‌ర‌హా రాజ‌కీయంలో పావుగా మారేది టీడీపీనే! ఎప్ప‌టి నుంచో తెలుగు రాష్ట్రాల‌లో నిల‌దొక్కుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి ప్ర‌తి అవ‌కాశం ఎంతో ముఖ్యం. ఇప్ప‌టికిప్పుడు రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించ‌కున్నా, రాష్ట్రంలో నెల‌కొన్న అశాంతిపై కాస్తయినా దృష్టి సారిస్తుందా అంటే అదీ అనుమాన‌మే! కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర‌కు కేంద్రం ప‌రిమితం అయిన దాఖలాలు ఎన్నో. ఇప్ప‌డిదే పెద్ద ప్ర‌మాద‌కారి కానుంది. ఇక రాజ‌ధానికి సంబంధించి రాష్ట్ర‌ప‌తి ఏవో అడిగారు అని టీడీపీ చెబుతోంది. అధికారం ఉన్నంత కాలం నిర్మాణాల‌కు సంబంధించి న‌మూనాల‌కే కాలం ఎక్కువ వెచ్చించిన టీడీపీ త‌రువాత ప‌నుల్లో వేగం పెంచ‌లేక‌పోయింద‌న్న వాద‌న వైసీపీలో ఉంది. పోనీ వైసీపీ అయినా రాజ‌ధానిపై ఫోక‌స్ చేసిందా అంటే అదీ లేదు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ కేంద్రంగా బాబు వేసే అడుగులు రాజ‌కీయంగా ఆయ‌న‌కు పెద్ద‌గా ఉప‌యుక్తం కాక‌పోయినా ఉప‌యోగ‌ప‌డ‌క‌పోయినా కాస్తో కూస్తో సానుభూతి రాజ‌కీయాలు న‌డిపేందుకు అవ‌కాశం మాత్రం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: