ఏపీలో ప్రజాపంపిణీ వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్నో ప్రభుత్వాలు మారినా దశాబ్దాల తరబడి రేషన్ వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నేరుగా ప్రతీనెలా సంధానకర్తలుగా ఉండేది కేవలం రేషన్ డీలర్లు మాత్రమే. ప్రభుత్వం నుంచివచ్చే సరుకులను పేదలకు అందేలా ఏళ్లతరబడి విధులను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేషన్ దుకాణాలవద్ద ప్రజల ఇబ్బందులు తొలగించే పేరుతో.. ప్రజలకు ఇళ్లవద్దకే సరుకులను అందించేలా ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు సీఎం జగన్. రేషన్ షాపుల్లో అక్రమాలు అరికట్టేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది చెప్పారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ డీలర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఇంటింటికీ సరుకుల పంపిణీ వచ్చాక పూర్తిగా తమ ఆదాయాన్ని కోల్పోయారు రేషన్ డీలర్లు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి.. నెలలో రెండుసార్లు పంపిణీని పూర్తి చేశారు రేషన్ డీలర్లు.. పేదల ఆకలి మంటలను చల్లార్చారు. అయితే ఇందుకు వారికి రావాల్సిన కమిషన్ మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనికి తోడు బియ్యం పంపిణీ కోసం ఉపయోగించే గోనె సంచులను కూడా ప్రభుత్వం వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించడంతో ఉన్న కాస్త ఆదాయం కూడా పోయింది. ఇప్పటికే పెరిగిన ఖర్చులు, షాపు అద్దెలు, విద్యుత్ చార్జీలను మోయలేక అవస్థలు పడుతూనే  రేషన్ షాపులు నడుపుతున్నారు డీలర్లు..

తాజాగా రేషన్ డీలర్లు తమకు రావాల్సిన కమిషన్ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి పలుదఫాలుగా వినతిపత్రాలు అందజేశారు. తమ గోడు పట్టించుకోవాలంటూ అధికారుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేటి నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకూ స్టాక్ పాయింట్ల వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. రేషన్ షాపుల బంద్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే రాత్రికి రాత్రి ఏం జరిగిందో గానీ.. బంద్ లేదని.. కేవలం నిరసనలు మాత్రమే చేస్తున్నట్టు మరొక ప్రకటన విడుదల చేశారు రేషన్ డీలర్లు.. ప్రభుత్వ పెద్దల నుంచి రేషన్ డీలర్ల అసోసియేషన్ నేతలకు వచ్చిన బెదిరింపుల కారణంగానే బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు మరికొందరు చెబుతున్నారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న రేషన్ డీలర్లు.. అధికారులకు ఎదురెళితే.. ఉన్న ఉపాధి కూడా కోల్పోతామనే భయంతోనే బెదిరింపులకు తలొగ్గినట్టు సమాచారం.. ఏదిఏమైనా ఏపీలో రేషన్ డీలర్లకు మాత్రం న్యాయం జరగడం లేదనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: