నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్ర‌ధాన పార్టీలు ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అక్టోబ‌ర్ 30 న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు పార్టీలన్ని చేస్తునన్న ప్ర‌చారం చివరి ద‌శ‌కు చేర‌కుంది. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే.. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు బీజేపీ అభ్య‌ర్థి గా ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో దిగారు. ఈట‌ల‌తో పాటు క‌మ‌లనాధులు గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈట‌ల గెలిస్తే తెలంగాణ‌లో బీజేపీ బ‌లం మ‌రింత పెరుగుతుంది. దీని వ‌ల్ల రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప్ర‌త్యామ్నాయం తామేన‌ని చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది.


  దీంతో  రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఈట‌ల గెలుపు కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఈట‌ల‌కు జ‌రిగిన అన్యాయం, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌చారానికి రేప‌టితో గ‌డువు ముగియ‌నుండ‌డంతో  బీజేపీ నాయ‌కులు ఇంటింటి ప్ర‌చారం నిర్వహిస్తూ బిజీబిజీ గా ఉన్నారు. ఈ క్ర‌మంలో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే బీజేపీ రాష్ట్ర నాయ‌కులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు మకాం వేశారు.

   హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసే బీజేపీ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ త‌రుణ్ చుగ్ సమన్వయం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అంటోన్న కమలనాథులు. పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం నాయ‌కుల‌కు, పార్టీ శ్రేణుల‌కు సూచ‌న‌లు ఇచ్చింది. ఎల్ల వేళ‌లా అప్ర‌మ‌త్తంగా ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. ప్ర‌చారానికి ఒకే రోజు స‌మ‌యం ఉండ‌డంతో ఆయా పార్టీల నేత‌లు ఇంటింటికీ వెళ్తు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అధికారం పార్టీ  త‌ర‌ఫున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్ప‌టికే హుజురాబాద్‌లోనే ఉంటూ ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: