తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ను ఓవైపు క‌రోనా, మ‌రో వైపు ఆర్థిక క‌ష్టాలు కోలుకోనివ్వ‌డం లేదు.  ఇప్ప‌టికే అప్పులు, తిప్ప‌ల‌తో సంస్థ కుదేల‌వుతోంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి ఆరు నెల‌ల్లోనే 1,246 కోట్ల న‌ష్టాన్ని చ‌విచూసింది. గ‌త ఆర్థిక ఏడాదిలో ఇదే స‌మ‌యానికి రూ.1,424 కోట్ల న‌ష్టం న‌మోదు అయింది. గ‌త ఏడాదితో పోల్చితే ఈసారి రూ.178 కోట్ల త‌గ్గిన‌ది. ఆర్టీసీ సంస్థ‌ను  క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌నే ఉద్దేశంతో ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఆర్ట‌సీ నూత‌న చైర్మ‌న్‌గా బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్‌, ఎండీగా వీసీ స‌జ్జ‌నార్‌ల‌ను నియ‌మించింది.  సంస్థ‌ను లాభాల బాట‌లో న‌డిపించ‌డానికి వీరికి పెద్ద స‌వాలుగా మారింది.  

గ‌త ఏడాదిలో క‌రోనా కార‌ణంగా కొన్ని స‌ర్వీసుల‌ను త‌గ్గించ‌డం, ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగించుకోవ‌డానికి ప్ర‌జ‌లు అంత‌గా ఆస‌క్తి చూడ‌క‌పోవ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,  తెలంగాణ‌ల మ‌ధ్య అంత‌రాష్ట్ర స‌ర్వీసులు లేక‌పోవ‌డంతో న‌ష్టాలు ఎక్కువ‌య్యాయి. వీటిని నియంత్రించేందుకు సుమారు వెయ్యికి పైగా బ‌స్సులు త‌గ్గించారు. తెలంగాణ‌లో కాస్త కరోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌జార‌వాణా వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ద‌స‌రా పండుగ‌, పెండ్లిల సీజ‌న్ అధికంగా ఉండ‌డంతో సుమారుగా రూ.3.5 కోట్ల అద‌న‌పు ఆదాయం ల‌భించింది. ఇటీవ‌ల ఒకేరోజు రూ.14.79 కోట్ల ఆదాయం వ‌చ్చి రికార్డు నెల‌కొలిపింది.

అయితే దీపావ‌ళి త‌రువాత ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచే యోచ‌న‌లో ఉన్న‌ట్టు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఆర్టీసీ సంస్థ వ్య‌వ‌హారాల‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స‌మీక్షించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుద‌ల‌పై సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఎంతమేర‌కు పెంచితే ఆర్థిక ప‌రిస్థితి కుదుట ప‌డుతుంద‌ని నివేదిక ఇవ్వాల‌ని సూచించారు సీఎం. ఈ మ‌ధ్య కాలంలో డీజిల్ ధ‌ర‌లు కూడ భారీగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ 50 శాతంపైగా న‌ష్టాల‌కు చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌మే కార‌ణం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో దాదాపు 15 శాతం నుంచి 20 శాతం వ‌ర‌కు ఛార్జీల‌ను పెంచే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇలా పెంచ‌డం మూలంగా రోజుకు రూ.13కోట్ల‌కు పైగా ఆదాయం వ‌స్తుంద‌ని అధికారులు అంచెనా వేస్తున్నారు. దీపావ‌ళి త‌రువాత ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం రూ.16 నుంచి 18 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని, దీంతో న‌ష్టాల‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని అధికారులు ఆలోచ‌న చేస్తున్నారు.  ఒకేసారి ఛార్జీల‌ను భారీగా పెంచితే ప్ర‌జ‌లు ప్రత్యామ్యాయ మార్గాల‌ను ఎంచుకునేందుకు వీలుంటుంద‌ని కొంద‌రు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దీపావ‌ళి త‌రువాత ఆర్టీసీ ఛార్జీల‌ను ఎంత‌శాతం పెంచుతార‌నేది కొద్ది రోజులు వేచి చూడాలి మ‌రి.


 


 మరింత సమాచారం తెలుసుకోండి: